పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం
సిద్దిపేటఎడ్యుకేషన్: సుస్థిరమైన పర్యావరణ పరిరక్షణ భవిష్యత్ తరాల మనుగడకు ఎంతో అవసరమని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా సహజ వనరులను, జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలని ప్రముఖ పర్యావరణ వేత్త, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ పురుషోత్తం సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో పర్యావరణ సమతుల్యత సమగ్రాభివృద్ధి అనే అంశంపై నిర్వహిస్తున్న రెండ్రోజుల జాతీయ సదస్సును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీతతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో వస్తున్న నూతన సాంకేతిక అవశ్యకతను గూర్చి ఐఐటీ హైద్రాబాద్ ప్రొఫసర్ సుబ్రమణ్యం, ప్రకృతి, సేంద్రియ వ్యవసాయాల ఆవశ్యకతపై ఆహార యోగా(ఎన్‌జీఓ) వ్యవస్థాపకుడు సామ ఎల్లారెడ్డి సమగ్రంగా వివరించారు. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 150 పరిశోధన పత్రాలు సదస్సుకు వచ్చాయని కన్వీనర్లు డా.హరిబాబు, డా. అయోధ్యరెడ్డి చెప్పారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ.. ఇలాంటి జాతీయ సదస్సులతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని, సదస్సు నిర్వా హకులను అభినందించారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్(ఐసీఎస్‌ఎస్‌ఆర్) ఆర్థిక సహకారంతో, పొలిటికల్ సైన్స్, జువాలజీ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.మధుసూదన్, మెదక్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్, కళాశాల సీఓఈ డాక్టర్ గోపాలసుదర్శనం, అధ్యాపకులు డా.లీలావతి, డా.ఉమామహేశ్వరీ, డా.మహేశ్, సుమలత తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ తరాలను కాపాడుకుందాం
పర్యావరణ జాతీయ సదస్సులో వక్తలు


