నేడు డయల్ యువర్ డీఎం
జహీరాబాద్ టౌన్: స్థానిక ఆర్టీసీ డిపోలో గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ జాకిర్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. ఆర్టీసీకి సంబంధించిన సందేహాలు, సమస్యలు, ఫిర్యాదులు, సూచనల గురించి 99592 26269 నంబర్‌కు కాల్ చేయాలని ఆయన కోరారు.
వైభవంగా వీరభద్రుడి
రథోత్సవం
భారీగా తరలివచ్చిన భక్తజనం
జిన్నారం (పటాన్‌చెరు): జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టం భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దివ్య రథోత్సవాన్ని మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మద్ది ప్రతాప్‌రెడ్డి, ఈవో శశిధర్ గుప్తాల ఆధ్వర్యంలో శైవ ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులను విభిన్న పూలతో అలంకరించిన రథంలో ప్రతిష్ఠించారు. అనంతరం వీరన్నగూడెం వీధుల్లో భక్తులు రథాన్ని లాగారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, అర్చక బృందం, భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఐఎన్‌టీయూసీతోనే
సమస్యల పరిష్కారం
ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి
పటాన్‌చెరు టౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం ఐఎన్‌టీయూసీతోనే సాధ్యమని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి స్పష్టం చేశారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలో బుధవారం కిర్బీ ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘం నాయకులతో జరిగిన సమావేశంలో నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడారు. కిర్బీ పరిశ్రమలో వచ్చే గుర్తింపు కార్మికసంఘం ఎన్నికల్లో పరిశ్రమలో ఉన్న ఇతర కార్మిక సంఘాల నాయకులను, కార్మికుల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. త్వరలో కార్మికులతో సర్వసభ్య సమావేశం నిర్వహించి, కార్మికుల మద్దతు కూడగడతామని తెలిపారు.
ఘనంగా మహానీయుల జయంత్యుత్సవాలు
అదనపు కలెక్టర్ మాధురి
సంగారెడ్డి జోన్: ప్రతీ గ్రామంలో మహనీయుల జయంత్యుత్సవాలను నిర్వహించేందు కు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ మాధురి తెలిపారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో మహానీయుల జయంత్యుత్సవాల సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్, మహాత్మా జ్యోతిబా పూలె మహనీయుల జయంత్యుత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరు సహకరించాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారి అఖిలేష్ రెడ్డి ,వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీశ్, ఈడీఎస్‌సీ కార్పోరేషన్ రామాచారి, ఎస్సీ ,ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మా ప్రాంతాన్ని
కలుషితం చేయొద్దు
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ ప్యారానగర్ డంపింగ్‌యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 50వ రోజుకు చేరుకున్నాయి. స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి మున్నూరు కాపు సంఘం వినతి పత్రాన్ని అందజేసి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ...డంపు యార్డ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం పూర్తిగా కలుషితంగా మారి పచ్చని పంట పొలాలు అటవీ ప్రాంతం నాశనమవుతాయన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత బాధాకరమన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం


