పరేషాన్‌ వద్దు.. లోన్‌ మోసాలను గుర్తించండి ఇలా!

Rajkummar Rao PAN Card Misused: How You Can Prevent it From Happening To You - Sakshi

ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలు ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరిగాయి. నగదు లావాదేవీలకు సంబంధించిన యాప్‌లు విరివిగా అందుబాటులోకి రావడంతో స్మార్ట్‌ఫోన్లతోనే ఆర్థిక కార్యకలాపాలు సులువుగా చక్కబెట్టుస్తున్నారు. ఇదే సమయంలో ఆన్‌లైన్‌ మోసాలు కూడా పెరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మోసగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావు పాన్‌కార్డును దుర్వినియోగం చేసి రుణ మోసాలకు పాల్పడ్డారు దుండగులు. గతంలో సన్నీలియోన్‌ కూడా ఇదే తరహాలో మోసగాళ్ల బారిన పడ్డారు. దీంతో వారిద్దరి సిబిల్‌ స్కోర్‌ తగ్గిపోయింది.

సిబిల్‌ స్కోర్‌ అంటే..?
బ్యాంకులు వ్యక్తిగత రుణాలు మంజూరు చేయడానికి సిబిల్‌ ఇచ్చే స్కోర్‌(క్రెడిట్‌ స్కోర్‌)ను ప్రామాణికంగా తీసుకుంటాయి. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ ఇచ్చే మూడంకెల సంఖ్యనే సిబిల్‌ స్కోర్‌గా పరిగణిస్తారు. ఈ సంఖ్య 300 నుంచి 900 వర‌కు ఉంటుంది. వ్యక్తిగత రుణ చరిత్ర ఆధారంగా ఈ స్కోర్‌ ఉంటుంది. 900 పాయింట్ల దగ్గరగా మీ స్కోర్‌ ఉంటే తక్కువ వడ్డీకి ఎక్కువ రుణం లభించే అవకాశాలు ఉంటాయి. ఈక్విఫాక్స్‌, ఎక్స్‌పీరియన్‌ లేదా సీఆర్‌ఐఎఫ్‌ వంటి క్రెడిట్‌ బ్యూరోలు కూడా స్కోర్‌ అందిస్తుంటాయి.

జాగ్రత్తలు పాటించాలి
రుణ మోసాల నుంచి తప్పించుకోవాలంటే వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. క్రెడిట్‌ స్కోర్‌ను రెగ్యులర్‌గా చెక్‌ చేసుకుంటూ ఉండాలి. కనీసం నెలకు ఒకసారైనా క్రెడిట్‌ స్కోరు చూసుకోవడం మంచిది. సిబిల్‌ వెబ్‌సైట్‌ లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా క్రెడిట్‌ స్కోరు చూసుకోవచ్చు. మీ పేరు మీద ఎన్ని లోన్స్‌ ఉన్నాయి, ఎంత మొత్తంలో రుణం తీసుకున్నారనే వివరాలు ఇందులో వెల్లడవుతాయి. (క్లిక్‌: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారో తెలుసుకోండి ఇలా..!)

ఇలా చేయొద్దు!
► ఐడీ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయకండి.

► ఆధార్‌, పాన్‌కార్డ్‌ నంబర్లను మీ ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో సేవ్‌ చేయొద్దు.

► స్కాన్‌ చేసిన ఆధార్‌, పాన్‌కార్డ్‌ కాపీలను మీ ఈ-మెయిల్‌లో పెట్టుకోవద్దు.

► ఈ-మెయిల్‌లో మీ పాన్‌కార్డ్‌ను షేర్‌ చేయాల్సివస్తే incognito మోడ్‌లో బ్రౌజర్‌ను వాడాలి.

► గుర్తింపు పత్రాల ఫొటో కాపీలను అటెస్ట్‌ చేసి మాత్రమే వాడాలి.

► ప్లబిక్‌ వై-ఫై వినియోగించి ఆన్‌లైన్‌ ట్రాన్‌టాక్షన్స్‌ చేయొద్దు.

► పాన్‌కార్డ్‌ ఇమేజ్‌ మీ ఫోన్‌లో సేవ్‌ చేసివుంటే.. లోన్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు ఫొటోగ్యాలరీ యాక్సెస్‌ ఇవ్వొద్దు.

వెంటనే స్పందించండి
మీకు తెలియకుండా మీ పేరు ఎవరైనా రుణాలు తీసుకున్నట్టు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.  క్రెడిట్‌ బ్యూరో వైబ్‌సైట్‌ ద్వారా మీ ఫిర్యాదును ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్లాలి. ఆన్‌లైన్‌లో cms.rbi.org.inకు ఫిర్యాదు చేయవచ్చు. crpc@rbi..org.inకు ఈ-మెయిల్‌ పంపవచ్చు. (క్లిక్‌: మీ సిబిల్‌ స్కోర్‌ పెరగాలంటే..)

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top