మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారో తెలుసుకోండి ఇలా..!

How Do Know If Anyone Misuse Your Pan Card - Sakshi

గతంలో వ్యక్తిగత రుణాలు మంజూరు కావాలంటే, చాలా పెద్ద విధానం ఉండేది. కానీ, ఇప్పుడు ఈ స్మార్ట్ యుగంలో అలా కాదు. చిటికిలో రుణాలు మంజూరు అవుతున్నాయి. ప్రస్తుతం అనేక ఫిన్‌టెక్ సంస్థలు తమ మొబైల్ యాప్ ద్వారా క్షణాలలో రుణాలను మంజూరు చేస్తున్నాయి. అయితే, ఈ రుణాల మంజూరు కోసం కేవల ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే సరిపోతుంది. అయితే, ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నం అవుతుంది. భౌతిక తనిఖీ లేకుండా కేవలం ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలతో రుణం మంజూరు కావడంతో కేటుగాళ్లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని రుణాలు తీసుకుంటారు. 

ఈ రుణం తీసుకొని చెల్లించకపోవడంతో నిజమైన వ్యక్తికి చెందిన సీబీల్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. కొద్ది కాలం క్రితం సినీ నటి సన్నీ లియోన్ పాన్ కార్డు సహాయంతో గుర్తుతెలియని వ్యక్తులు లోన్ తీసుకున్నారని తను పేర్కొంది. లోన్ తీసుకున్న విషయం కూడా తనకు తెలియదని ఆమె తెలిపింది. దీని వల్ల తన సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడిందని ట్విట్టర్‌లో వివరించింది. ముఖ్యంగా ఇండియా బుల్స్‌కు చెందిన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ అయిన ధని స్టాక్స్ లిమిటెడ్‌పై ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. సన్నీలియోన్ ట్వీట్ తర్వాత అనేక మంది బాధితులు ట్విట్టర్‌లో తాము ఎలా మోసపోయామో వివరించారు.

అయితే, ఇతరులు ఎవరైనా మన వివరాలతో దేశ వ్యాప్తంగా లోన్ తీసుకుంటే మనం తెలుసుకునే వీలు ఉంది. పేటీఎమ్, బ్యాంక్ బజార్ వంటి ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థలు వినియోగదారులకు వీటికి సంబంధించిన ఈ రిపోర్ట్స్ అందిస్తున్నాయి. ముందుగా వీటిలో మన పాన్ కార్డు, ఆధార కార్డు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు మీ క్రెడిట్ రిపోర్ట్ ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. ప్రతి నెల మనం మన క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకోవడం వల్ల ఇలాంటి మోసాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

(చదవండి: టెక్‌ మహీంద్రా భారీ స్కెచ్‌.. వెయ్యి మందితో అదిరిపోయే ప్లాన్‌!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top