భారత్‌లో హాలీవుడ్‌ ఫ్లాప్‌.. | Hollywood flop in India: 41 percent decline in income in five years | Sakshi
Sakshi News home page

భారత్‌లో హాలీవుడ్‌ ఫ్లాప్‌..

May 7 2025 6:02 AM | Updated on May 7 2025 6:02 AM

Hollywood flop in India: 41 percent decline in income in five years

అయిదేళ్లలో 41% క్షీణించిన ఆదాయం 

థియేటర్లలో 61% తగ్గిన ప్రేక్షకుల రాక 

రెండేళ్లుగా రూ.200 కోట్ల క్లబ్‌కు దూరం 

2019తో పోలిస్తే సగానికి తగ్గిన వాటా 

దూకుడు మీదున్న మాలీవుడ్, టాలీవుడ్‌ 

ఆదాయంలో రెండో స్థానంలో టాలీవుడ్‌

సాక్షి, స్పెషల్‌ డెస్క్: ఒకప్పుడు హాలీవుడ్‌ సినిమాలంటే... మన దేశంలో రూ.వేలకోట్ల కలెక్షన్లు కురిపించేవి. టైటానిక్, అవతార్‌ వంటివి భారతీయులనూ ఉర్రూతలూగించాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆర్మాక్స్‌ బాక్సాఫీస్‌ రిపోర్టు 2024 ప్రకారం.. హాలీవుడ్‌ సినిమాల ద్వారా బాక్సాఫీస్‌కు సమకూరిన ఆదాయం అయిదేళ్లలో ఏకంగా 41% తగ్గింది. మన ప్రాంతీయ భాషల సినిమాలతో పెరుగుతున్న పోటీ, మారుతున్న వీక్షకుల ఆసక్తులు, సూపర్‌హీరోల చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడం, ఓటీటీల దూకుడు.. వెరసి బాక్సాఫీస్‌ వద్ద హాలీవుడ్‌ సినిమాలకు ఆదరణ తగ్గుతోందని పరిశ్రమ చెబుతోంది.

 దేశంలో బాక్సాఫీస్‌ ఆదాయం 2024లో రూ.11,833 కోట్లకు చేరింది. బాక్సాఫీస్‌లో హాలీవుడ్‌ వాటా భారత్‌లో 2019లో 15%. 2024 నాటికి దాదాపు సగం తగ్గి ఏకంగా 8 శాతానికి పడిపోయింది. గత అయిదేళ్లుగా వాటా క్రమంగా తగ్గుతోంది. హాలీవుడ్‌ సినిమాల ద్వారా సమకూరిన ఆదాయం 2019లో రూ.1,595 కోట్ల నుంచి 2024లో రూ.941 కోట్లకు వచ్చి చేరింది.

200 కోట్ల క్లబ్‌ లోనూ లేవు.. 
హాలీవుడ్‌ మూవీస్‌ను చూసేందుకు థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య 2019లో 9.8 కోట్లు. గత ఏడాది ఈ సంఖ్య కేవలం 3.8 కోట్లకు పరిమితమైంది. కరోనా కాలాన్ని మినహాయిస్తే 12 ఏళ్లలో ఇదే తక్కువ. గత రెండేళ్లలో రూ.200 కోట్ల క్లబ్‌లో ఒక్క సినిమా కూడా చేరకపోవడం గమనార్హం. మూడు సినిమాలే రూ.100 కోట్లకుపైగా ఆదాయాన్ని సమకూర్చాయి. వీటిలో ముఫాసా: ద లయన్‌ కింగ్‌ రూ.178 కోట్లు, డెడ్‌పూల్‌ అండ్‌ వుల్వరీన్‌రూ.160 కోట్లు, గాడ్జిల్లా వర్సెస్‌ కాంగ్‌: ద న్యూ ఎంపైర్‌ రూ.133 కోట్లు సంపాదించాయి. బాక్సా ఫీస్‌ వద్ద హాలీవుడ్‌ సినిమాల ఆదాయంలో సూపర్‌హీరోస్‌ మూవీస్‌ వాటా ఒకప్పుడు 50% ఉండేది. 2024లో ఇది 27 శాతానికి పడిపోయింది.

దక్షిణాది సినిమాలే..
భారత బాక్సాఫీస్‌ వద్ద 2024లో పుష్ప–2 టాప్‌లో నిలిచి రూ.1,403 కోట్ల గ్రాస్‌ కలెక్షన్‌తో చరిత్ర సృష్టించింది. కల్కి 2898 ఏడీ రూ.776 కోట్లు, స్త్రీ–2 రూ.698 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది హిందీ సినిమా మొత్తం రూ.4,679 కోట్ల కలెక్షన్లతో ముందంజలో ఉంది. హిందీ సినిమాల కలెక్షన్లలో దక్షిణ భారత చిత్రాల డబ్బింగ్‌ వెర్షన్ల నుండి 31% సమకూరడం విశేషం. ఇక టాలీవుడ్‌ పరిశ్రమ 2022 నుంచి ఏటా రూ.2,000 కోట్లకుపైగా ఆర్జిస్తోంది. రెవెన్యూ పరంగా అయిదేళ్లలో మలయాళ పరిశ్రమ 93%, తెలుగు చిత్రసీమ 67%, తమిళ పరిశ్రమ 25% వృద్ధి సాధించాయి. హిందీ, కన్నడల్లో మాత్రం తగ్గుదల నమోదైంది. ఇక గత ఏడాది దేశవ్యాప్తంగా 88.3 కోట్ల మంది థియేటర్లకు వచ్చి సినిమాలను ఆస్వాదించారు.

ట్రంప్‌ స్క్రిప్ట్ తో తెర
హాలీవుడ్‌కి మనదేశంలో క్రేజ్‌ తగ్గి.. మన సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ పెరుగుతోంది అని సంతోíÙంచేలోపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిడుగులాంటి వార్త చెప్పారు. జాతీయ భద్రత, ఆర్థిక సమస్యలను పేర్కొంటూ అమెరికాలోకి వచ్చే అన్ని విదేశీ చిత్రాలపై 100% సుంకాన్ని ప్రకటించారు. యూఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద భారతీయ చిత్రాలు ఏటా సుమారు రూ.850 కోట్లు ఆర్జిస్తున్నాయి. ట్రంప్‌ నిర్ణయం కారణంగా యూఎస్‌లో విడుదలయ్యే సినిమాల సంఖ్య తగ్గుతుందని పరిశ్రమ భావిస్తోంది. టారిఫ్‌ అమలులోకి వస్తే ఎగ్జిబిటర్లు టికెట్‌ ధరలను పెంచాల్సి వస్తుందని, ఫలితంగా ఖరీదు ఎక్కువై ప్రేక్షకుల రాక తగ్గుతుందని విశ్లేషకులు అంటున్నారు.

హాలీవుడ్‌ క్రేజ్‌ తగ్గడానికి అనేక కారణాలు..  
ఓటీటీల దూకుడు.. వెబ్‌ సిరీస్‌లకు పెరుగుతున్న ఆదరణ 
ప్రాంతీయ భాషా చిత్రాలు, వాటి డబ్బింగ్‌ వెర్షన్ల ప్రభావం.. 
కొరియన్, ఇతర భాషా చిత్రాల ప్రభావం.. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు 

Advertisement
 
Advertisement
Advertisement