ఆలోచించు.. ఆవిష్కరించు | - | Sakshi
Sakshi News home page

ఆలోచించు.. ఆవిష్కరించు

Nov 2 2026 9:12 AM | Updated on Nov 2 2026 9:12 AM

సద్వినియోగం చేసుకోవాలి

● ఇన్నోవేటర్స్‌ ఛాలెంజ్‌కు ప్రాజెక్టుల ఆహ్వానం

● ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సత్తాచాటే అవకాశం

● ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఈనెల 6 చివరి గడువు

కేశంపేట: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు శాసీ్త్రయ దృక్పథం, పరిశోధనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణ నైపుణ్యాలను ప్రోత్సాహించేందుకు తెలంగాణ ఫ్యూచర్‌ ఇన్నోవేటర్స్‌ ఛాలెంజ్‌ (టీఎఫ్‌ఐసీ) 2026– 27 కార్యక్రమ నిర్వహణకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. పాఠశాల స్ధాయి నుంచి కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు రూపొందించేందుకు ఈ పోటీలు మంచి వేదికగా నిలవనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సత్తాచాటవచ్చు.

అర్హులు వీరే..

ప్రభుత్వ, స్ధానిక సంస్థలు, కేజీబీవీ, తెలంగాణ మాడల్‌ స్కూల్‌ (టీ జీఎంఎస్‌), గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. ఆసక్తి కలిగిన వారు నవంబర్‌ 6లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముగ్గురు విద్యార్థులు బృందంగా ఏర్పడి ప్రాజెక్టులను రూపొందించవచ్చు. తమ పరిధిలో ఉన్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను చూపించే ఆవిష్కరణలకు రూపం ఇవ్వవచ్చు. గతంలో ఇన్‌స్పైర్‌తో పాటు ఇతర సైన్స్‌ పోటీల్లో పాల్గొన్న వారు తమ ప్రాజెక్టుల్లో అసరమైన మార్పులు చేసి, పోటీలో పాల్గొనవచ్చు. టీఈఎల్‌ఎఎన్‌ఎజీఎ.సీఓడీఈఎంఐటీఆర్‌ఎ.ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తును చేసుకోవాలి. విద్యార్ధులు తమ పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ (పీఈఎన్‌) నంబర్‌తో లాగిన్‌ కావాలి.

ఆరు దశలో పోటీలు

● మొదటి దశలో విద్యార్థులు నమోదు చేసిన ఆలోచనలను అన్‌లైన్‌ పోర్టల్‌లో ప్రాజెక్టు ప్రతిపాదనలను స్వీకరిస్తారు.

● రెండో దశలో నిపుణుల కమిటీ విద్యార్థులు సమర్పించిన ప్రాజెక్టులను పరిశీలించి జిల్లా స్థాయికి 30 ఉత్తమ ఆవిష్కరణలను ఎంపిక చేస్తుంది.

● మూడో దశలో నిపుణుల కమిటీ ఎంపిక చేసిన 30 ప్రాజెక్టులతో జిల్లా స్థాయి ప్రదర్శన నిర్వహిస్తారు.

● నాలుగో దశలో ప్రాజెక్టు నాణ్యత, వినూత్న ఆలోచన, ప్రాజెక్టుతో ఉపయోగం తదితర అంశాలను పరిశీలించి, మూడు అత్యుత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి మొదటి, రెండో స్థానంలో నిలిచిన వాటిని రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారు.

● ఐదో దశలో జిల్లా నుంచి ఎంపికై న రెండు ప్రాజెక్టులకు డిజిటల్‌ లేదా భౌతిక నమూనాలను రూపొందించి రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు సిద్ధం చేస్తారు.

● చివరిదశలో రాష్ట్ర స్థాయికి జిల్లాల నుంచి ఎంపికై న ప్రాజెక్టుల ఆవిష్కరణ ప్రదర్శన హైదరాబాద్‌లో నిర్వహిస్తారు.

విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు కొత్త పరిష్కారం చూపించే దిశగా ఆవిష్కరణలు రూపొందించాలి. మరిన్ని వివరాలకు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులను సంప్రదించాలి.

– శ్రీనివాసరావు,

జిల్లా సైన్స్‌ అధికారి, రంగారెడ్డి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement