5న వాహనాల వేలం | - | Sakshi
Sakshi News home page

5న వాహనాల వేలం

Nov 2 2026 9:12 AM | Updated on Nov 2 2026 9:12 AM

5న వాహనాల వేలం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లీకొడుకుల మృతి ముదిరాజ్‌లు అన్ని రంగాల్లో రాణించాలి యువకుడిపై పోక్సో కేసు

ఆమనగల్లు: అటవీశాఖకు సంబంధించిన వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 5న నగరంలోని గుర్రంగూడలో బహిరంగ వేలం వేయనున్నట్లు ఫారెస్ట్‌ డివిజనల్‌ అధికారి శివ్‌ఆశిశ్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 35 వాహనాలకు వేలం నిర్వహిస్తామని, ఇందులో పాల్గొనే వారు రూ.500 చెల్లించి ఫారం పొందాలని సూచించారు. ఫారెస్ట్‌ డివిజనల్‌ అధికారి ఆమనగల్లు పేరిట రూ.5 వేలు డీడీ తీసుకుని ఈనెల 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు టెండర్‌ ఫారాలు అందించాలని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

గోపాల్‌నాయక్‌

కొత్తూరు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. కొత్తూరులో ఆదివారం నిర్వహించిన మండల నూతన కమిటీ ఎన్నికలో ఆయన పాల్గొన్నారు. అధ్యక్షుడిగా గౌరయ్య, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శిగా ప్రిన్స్‌, కోశాధికారిగా లక్ష్మితో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేయాలన్నారు. జీవోలో భాగంగా స్థానికతను కోల్పోయి ఇతర జిల్లాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు రఘుపాల్‌, రాజ్‌కుమార్‌, భాస్కర్‌రావు, నివిత, అనూష, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

పోల్కంపల్లిలో విషాదం

ఇబ్రహీంపట్నం రూరల్‌: తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందడంతో బాధిత కుటుంబం గుండెలు బాదుకుంటోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పోల్కంపల్లికి చెందిన పూల భిక్షపమ్మ (52) అనారోగ్యం బారిన పడి కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైంది. ఈక్రమంలో తొమ్మిది రోజుల క్రితం చనిపోయింది. అప్పటికే ఆమె కొడుకు శంకర్‌ (32) ఆరోగ్యం బాగోలేక గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తల్లి అంత్యక్రియల కోసం తీసుకువచ్చి, తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం భిక్షపమ్మ దశదినకర్మ ఉండగా, శంకర్‌ కోలుకోకపోవడంతో వాయిదా వేశారు. ఆస్పత్రిలో ఉన్న ఆయన ఆదివారం మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ఇంటి పెద్దలను కోల్పోయి, కన్నీరుమున్నీరవుతున్నారు.

మంచాల: ముదిరాజ్‌లు మరింత బలపడాలని శాసన మండలి వైస్‌ చైర్మన్‌ బండ ప్రకాశ్‌ముదిరాజ్‌, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అస్మత్‌పూర్‌లో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి, గంగాదేవి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనాభాలో అధిక శాతం ఉన్న ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ మహా సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.యాదయ్యముదిరాజ్‌, మత్స్యపారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు దూస వెంకటేశ్‌ ముదిరాజ్‌, సంఘం నాయకులు బోళ్ల జగన్‌, ఎడ్ల గణేశ్‌, ధర్మంవీర్‌, సత్యం ముదిరాజ్‌, గంట భిక్షపతి, జిల్లామోని సత్తయ్య,కావలి నర్సింహ, బీఆర్‌ఎస్‌ నేతలు, పలు గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

దోమ: బాలికను వేధించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన దోమ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వసంత్‌ జాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన బాలిక(16)ను సిద్ది గణేశ్‌ అనే యువకుడు మూడేళ్లుగా ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement