ఆరుద్ర అమృతమయ్యేనా! | - | Sakshi
Sakshi News home page

ఆరుద్ర అమృతమయ్యేనా!

Jun 25 2026 7:28 AM | Updated on Jun 25 2026 7:28 AM

ఎరువుల ధరలు (50 కేజీల బస్తా)

భగ్గుమంటున్న ఎరువుల ధరలు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: నైరుతి రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి. మృగశిరకు ముందే నైరుతి పలకరిస్తుందని వాతావరణశాఖ ప్రకటించడంతో వానాకాలం సాగుపై రైతులు ఆశలు పెంచుకున్నారు. రెండు రోజులు మురిపించిన వానలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. నగరంలో రోజూ ఏదో ఒక చోట వర్షం కురుస్తున్నా.. శివారులోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. వరుణుడు కరుణించక రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. మెట్ట పంటలపై ఆధారపడిన రైతుల్లో ఆందోళన మొదలైంది. సాధారణంగా బోరుబావుల కింద మృగశిర కార్తెలో నారుపోసుకుంటారు. ఈ సమయంలో పత్తి, పెసర, కంది విత్తనాలు చల్లుకోవడం పరిపాటి. ఈ సారి ఇప్పటి వరకు ఆ దిశగా పనులు ముందుకు సాగలేదు. నవంబర్‌ మొదటి వారంలో వానాకాలం కోతలు పూర్తయితే.. యాసంగికి నార్లు పోసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇందుకోసం మృగశిర, ఆరుద్రలో వర్షాలు కురిస్తే.. భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో నీరు సంవృద్ధిగా లభిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఆ స్థాయిలో వర్షాలు కురియలేదు. ఇప్పటికీ నారు పోయలేదు. తొలకరి వర్షాలకు భూమిలో నాటిన పత్తి, మొక్కజొన్న విత్తనాలు ఇప్పటికీ మొలకెత్తలేదు.

రంగారెడ్డిలో పంటసాగు ఇలా

జిల్లాలో వానాకాలం సీజన్‌లో 5.06 లక్షల ఎకరాల్లో పంట సాగవుతాయని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. వీటిలో వరి 1.62 లక్షల ఎకరాలు, పత్తి 1.94 లక్షల ఎకరాలు, జొన్నలు 7,750 ఎకరాలు, రాగులు 30 ఎకరాలు, కొర్రలు పది ఎకరాలు, కందులు 12 వేల ఎకరాలు, ఉలవలు 60 వేల ఎకరాలు, పెసర 50 వేల ఎకరాల్లో సాగవుతుందని అంచనా. 52,452 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతాయి. ఇందుకు 91,546 మెట్రిక్‌ టన్నుల ఎరువు అవసరం. వీటిలో 32 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా, 12,732 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, వెయ్యి మెట్రిక్‌ టన్నుల ఎస్‌ఎస్‌పీ,1200 మెట్రిక్‌ టన్నుల ఎంఓపీ, 30 వేల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరం ఉంటుందని అంచనా. ప్రస్తుతం డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల వాడకం ఎక్కువ. ఆగస్టులో యూరియా సహా మరికొన్ని ఎరువుల వినియోగం రెట్టింపవుతుంది. జిల్లాలోని 300పైగా ఉన్న ఎరువులు, విత్తన షాపుల ద్వారా రైతులకు చేరవేస్తున్నారు.

వికారాబాద్‌లో..

జిల్లాలో 8,81,730 ఎకరాల సాగు భూమి ఉండగా, వీటిలో 3,18,462 మంది రైతులు 5,85,105 ఎకరాల్లో పంట సాగు చేయనున్నట్లు అంచనా. ఆ మేరకు 2,825.01 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసమని గుర్తించింది. 17,719 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 32,329 మెట్రిక్‌ టన్నుల యూరియా, 19,877 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 3,658 మెట్రిక్‌ టన్నుల ఎంఓపీ, 1,854 మెట్రిక్‌ టన్నుల ఎస్‌ఎస్‌పీ ఎరువులు అవసరమని గుర్తించింది. రైతుల అమాయకత్వాన్ని కొంత మంది దళారులు క్యాష్‌ చేసుకునేందుకు యత్నిస్తున్నారు. నకిలీ విత్తనాలను గుట్టుగా మార్కెట్‌కు తరలించి రైతులకు అంటగడుతున్నట్లు ఫిర్యాదులు లేకపోలేదు. ఇటీవల కొడంగల్‌ మండలం రావులపల్లిలో 250 కేజీలు, దౌల్తాబాద్‌ మండలం నీటూరులో 375 కేజీల నకిలీ విత్తనాలు సీజ్‌ చేశారు. జూన్‌ 11న షాద్‌నగర్‌ డివిజన్‌ లాల్‌సింగ్‌ తండాలో ఓ మహిళ ఇంట్లో నిల్వ చేసిన 22 కేజీల నిషేధిత బీటీ–3(నకిలీ) విత్తనాలు పట్టుబడ్డాయి. ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు.

ఉమ్మడి జిల్లాలో పంట సాగు అంచనా ఎకరాల్లో

పంట వికారాబాద్‌ రంగారెడ్డి

వరి 1.42 లక్షలు 1.62 లక్షలు

పత్తి 2.63 లక్షలు 1.94 లక్షలు

కందులు 1.50లక్షలు 12 వేలు

మొక్కజొన్న 50,450 25,100

జొన్నలు 2,500 7,750

పెసలు 13,500 50 వేలు

జొన్నలు 1,260 750

మినుములు 5 వేలు 3,500

ఎరువు పాతధర కొత్తధర

కాంప్లెక్స్‌ 14:35ః14 1900 2350

కాంప్లెక్స్‌ 24ః24ః0 2000 2300

కాంప్లెక్స్‌ 10ః26ః26 1950 2250

కాంప్లెక్స్‌ 16ః16ః16 1575 2050

ఎంఓపీ 1850 1975

ఎస్‌ఎస్‌పీ 615 775

మృగశిరలో మురిపించి.. ముఖం చాటేసిన వరుణుడు

ఆశించిన స్థాయిలో కురవని వర్షాలు

ఓ వైపు ఎల్‌నినో.. మరో వైపు నకిలీ విత్తన బెడదతో చిత్తవుతున్న రైతులు...

ఆకాశం వైపు అన్నదాత చూపులు

పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత వాతావరణం వ్యవసాయ పంటల ఎరువులపైనా తీవ్ర ప్రభావం చూపింది. ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే ఆశించిన దిగుబడి, మద్దతు ధర లభించక వరుస నష్టాలను చవి చూస్తున్న రైతన్న.. ఈ ధరాభారాన్ని మోయలేకపోతున్నారు. డీలర్ల వద్ద ఆశించిన స్థాయిలో నిల్వలు లేక ఇబ్బందిగా మారింది. ఎరువుల కొరతతో వ్యాపారులు ప్రభుత్వం నిర్ధేశించిన దానికి మించి విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఎప్పటికప్పుడు ఆయా షాపుల్లో తనిఖీలు నిర్వహించి, స్టాక్‌ పొజిషన్‌ను పరిశీలించాల్సిన జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement