సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఖాళీగా ఉన్న 23 చౌక ధరల దుకాణాల డీలర్‌షిప్‌నకు అర్హులైన అభ్యర్థుల నుంచి జిల్లా పౌరసరఫరాల శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రిజర్వేషన్ల ప్రాతిపదికన కేటాయించే ఈ డీలర్‌షిప్‌నకు పదో తరగతి ఉత్తీర్ణులై.. 40 ఏళ్లలోపు ఉన్న వారు జూలై 9వ తేదీలోగా అప్లికేషన్ సమర్పించాలన్నారు. స్థానిక, కుల ధ్రువీకరణ, విద్యార్హత, చిరునామా ధ్రువీకరించే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్‌కార్డు వంటి జిరాక్సు ప్రతులను దరఖాస్తు జత చేయాలి. శేరిలింగంపల్లిలో ఐదు, సరూర్‌నగర్, చంపాపేట్, లింగోజిగూడ, మియాపూర్‌లో రెండు, హయత్‌నగర్, చింతల్‌కుంట, హస్తినాపురం, మాదాపూర్, శాస్త్రీపురం, ఆర్‌కేపురం హైకోర్టు కాలనీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 23 దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలోని సహాయ సరఫరా అధికారి కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాల్సిందిగా సూచించింది.
జూలై 31వరకు దరఖాస్తుల స్వీకరణ
ఇబ్రహీంపట్నం రూరల్: న్యాయ పరిపాలనలో శిక్షణ పొందేందుకు అర్హులైన లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2026–27 సంవత్సరానికి గాను మూడేళ్లు న్యాయ పరిపాలనలో శిక్షణ పొందేందుకు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు చెందిన ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వారిచే గుర్తింపబడిన ఇనిస్టిట్యూషన్స్, సెంట్రల్ యాక్ట్, ప్రొవిజనల్ యాక్ట్ కింద ఇన్ కార్పొరేషన్ చేయబడిన దేశంలోని ఏదేని వర్సిటీ నుంచి ఏదేనీ ఫ్యాకల్టీ చేసిన డిగ్రీ, లా డిగ్రీ పొందిన వారై ఉండలన్నారు. జూలై 1వ తేదీ నాటికి 23 ఏళ్లు నిండి ఉండాలని తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు మించొద్దని తెలిపారు. అభ్యర్థి గతంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఉండరాదన్నారు. ఈ మూడేళ్ల కాలంలో నెలకు రూ.3వేల చొప్పున స్టైఫండ్ అందుతుందన్నారు. మొదటి సంవత్సరం మాత్రం పుస్తకాలు, ఫర్నిచర్ కొనుగోలు రూ.50 వేలు మంజూరు చేస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31వ తేదీ లోపు ఈపాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి
మొయినాబాద్: సర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ పార్థసింహారెడ్డి, తహసీల్దార్లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం నుంచి జులై 24 వరకు బీఎల్‌ఓలు ఇంటింటికి తిరిగి అర్హులైన ఓటర్లను గుర్తిస్తారన్నారు. ఓటరు జాబితాలో తప్పులు, నకిలీ ఓటర్లను తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను చేపడుతోందన్నారు. ఎన్యుమరేషన్ ఫాంలో పూర్తి వివరాలను సేకరిస్తారని.. అందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్లు గౌతమ్‌కుమార్, కృష్ణ, అన్వర్, సురేందర్ తదితరులు ఉన్నారు.
కొరడా ఝుళిపించిన హైడ్రా
హయత్‌నగర్: చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో వెలిసిన ఆక్రమణపై హైడ్రా కొరడా ఝుళిపించింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మర్రిపల్లి గ్రామంలో సుమారు 31 ఎకరాల్లో చెరువు విస్తరించి ఉంది. పక్కనే ఉన్న పట్టా పొలంలో రెడిమిక్స్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ పనిచేసే కార్మికుల నివాసాలను చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో సదరు యజమాని నిర్మించారు. దీనిపై ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఆక్రమణలను గుర్తించి వాటిని బుధవారం తొలగించారు. ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ధారించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. చెరువులో పూడ్చిన మట్టిని తొలగించాలని ఆక్రమణదారులను హైడ్రా ఆదేశించింది.


