పనుల్లో వేగం పెంచుతాం
మున్సిపాలిటీల్లో తాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన పనులు ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. పలు కాలనీల్లో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోర్లలో నీరు అడుగంటంతో వాటర్ ట్యాంక్‌లను ఆశ్రయిస్తున్నారు.
పరిగి పట్టణంలో నిరుపయోగంగా ఉన్న పైపులు
వికారాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మున్సిపాలిటీల్లో అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం జిల్లాలోని నాలుగు పురపాలికలకు రూ.59 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులను తాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు వెచ్చించాల్సి ఉంటుంది. పనుల పర్యవేక్షణ బాధ్యతలను పబ్లిక్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు అప్పగించారు. వారు హైదరాబాద్ నుంచి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. పనులు ప్రారంభించి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు 40 శాతం పనులు కూడా పూర్తి చేయలేదు. ఐదేళ్ల క్రితం అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించి గ్రామాలు, పట్టణాలకు తాగునీరు సరఫరా చేసింది. అయితే మున్సిపాలిటీల్లో కొత్తగా ఏర్పాటైన కాలనీలకు అమృత్ 2.0లో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. కానీ 2017లో రూపొందించిన డీపీఆర్ ప్రకారమే చేపడుతున్నారు. దీంతో నీటి సమస్య ఉన్న కాలనీలను వదిలేసి మళ్లీ పాత కాలనీల్లోనే పనులు చేపడుతున్నారు. అందులో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం షాకాజ్ నోటీసులు ఇచ్చినా ఎలాంటి స్పందన కనిపించడంలేదు.
ముందుకు సాగని పనులు
అమృత్ 2.0 పథకం కింద మంజూరైన నిధులను ఓవర్ హెడ్ ట్యాంక్‌ల నిర్మాణం, పైప్‌లైన్ల ఏర్పాటు, నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైప్‌లైన్ పనులు కొంత మేర పూర్తి కాగా.. ట్యాంక్‌ల నిర్మాణం ప్రారంభించలేదు. తాండూరు మున్సిపాలిటీకి రూ.27 కోట్లు, పరిగికి రూ.5.5 కోట్లు, వికారాబాద్ రూ.12 కోట్లు, కొడంగల్‌కు రూ.4.5 కోట్లు మంజూరు చేశారు. వికారాబాద్ మున్సిపాలిటీలో 85వేలు, తాండూరులో 95వేలు, పరిగిలో 35వేలు, కొడంగల్‌లో 25వేల జనాభా ఉంది. వీరి అవసరాలకు అనుగుణంగా తాగునీటి వ్యవస్థను బలోపేతం చేయాలి. అయితే అక్కడక్కడ పైపులు వేయడం, ట్యాంకుల నిర్మాణం కోసం పునాదులు తీయడం మినహా పనులు ముందుకు సాగడంలేదు.
నత్తనడకన అమృత్ 2.0 పనులు
రెండేళ్లు పూర్తయినా 40 శాతమే..
నాలుగు మున్సిపాలిటీలకు రూ.59 కోట్లు మంజూరు
ప్రారంభం కాని ట్యాంక్‌ల నిర్మాణం
పనులు నెమ్మదించిన మాట వాస్తవమే. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఇందుకు కారణం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారు నోటీసులు కూడా ఇచ్చారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
– సాజీద్, డిప్యూటీ ఎగ్జ్‌క్యూటీవ్ ఇంజనీర్
జిల్లాలో 11.5 లక్షల జనాభా
జిల్లాలో రెండు చోట్ల నీటి శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. పరిగి మండలం జాఫర్‌పల్లి సమీపంలో రోజుకు 135 ఎంఎల్‌డీ నీటిని శుద్ధి చేసి పంపింగ్ చేయగలిగిన ప్లాంట్ ఉంది. కొడంగల్‌లో 17 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన మరో ప్లాంట్ ఉంది. రోజుకు 18 నుంచి 22 గంటల పాటు నీటిని శుద్ధి చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 11.5 లక్షల జనాభా ఉంది. వీరికి రోజుకు 130 ఎంఎల్‌డీ నీరు అవసరం అవుతాయి. అయితే రెండు ప్లాంట్ల నుంచి ఉన్న సామర్థ్యం మేరకు నీటి సరఫరా కావడం లేదు. పరిగి పట్టణంలోని తిరుమల, మైత్రి వెంచర్ కాలనీలు, వేంకటేశ్వర టెంపుల్ కాలనీల్లో రెండేళ్లుగా తాగినీటి సరఫరా నిలిచి పోయింది. ఈ కాలనీల్లో బోరుబావులు కూడా అడుగంటాయి. ప్రస్తుతం ప్రజలు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడ్డారు.


