ఎదురెదురుగా బైకులు ఢీ: ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

ఎదురెదురుగా బైకులు ఢీ: ఒకరి మృతి

Jun 22 2026 7:03 AM | Updated on Jun 22 2026 7:03 AM

తాండూరు టౌన్‌ : ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ పరమేశ్వర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం కొత్లాపూర్‌ గ్రామానికి చెందిన బస్వరాజు (55) అనే వ్యక్తి బైకుపై వెళ్తుండగా, శివాజీ చౌక్‌ సమీపంలో ఎదురుగా వచ్చిన బైకు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన బస్వరాజును ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. మరో బైకుపై ఉన్న తరుణ్‌ చారి అనే యువకుడు స్వల్పంగా గాయపడినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

బబుల్‌గమ్‌ తింటావా

అని బాలుడిని కొట్టిన టీచర్‌

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తండ్రి

తాండూరు రూరల్‌: తరగతి గదిలో బబుల్‌గమ్‌ తింటావా అని ఓ బాలుడిని టీచర్‌ చితకబాదింది. ఈ ఘటన తాండూరు మండలం కరన్‌కోట్‌ గ్రామంలో ఆదివారం అలస్యంగా వెలుగుచూసుంది. విద్యార్థి తల్లిదండ్రులు.. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ ప్రాథమిక పాఠశాలలో మణికంఠ అనే విద్యార్థి ఐదో తరగతి చదువుతున్నాడు. శనివారం తరగతి గదిలో బబుల్‌గమ్‌ తింటుండగా గమనించిన ఉపాధ్యాయురాలు రజిని బాలుడిని కొట్టింది. తల, చేతికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి పాండు ఆదివారం కరనోట్‌ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థి కింద పడటంతో గాయాలైనట్లు పాఠశాల ఉపాధ్యాయులు చెప్పినట్లు ఎస్‌ఐ రాథోడ్‌ వినోద్‌ పేర్కొన్నారు.

బైక్‌ పైనుంచి పడి వ్యక్తి మృతి

దౌల్తాబాద్‌: కూలి పనులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తి వాహనం పైనుంచి కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి మండలంలోని నంద్యానాయక్‌తండా సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. తండాకు చెందిన దేవిజనాయక్‌(49), హోబ్యానాయక్‌ రోజూ కూలి పనులు నిమిత్తం మద్దూరు వెళ్తుంటారు. ఎప్పటిలాగే ఆదివారం పనులు ముగించుకుని రాత్రి బైక్‌పై ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో నంద్యానాయక్‌ తండా కల్వర్టు దగ్గర బైక్‌ పైనుంచి ఇద్దరు కింద పడడంతో దేవిజనాయక్‌ తలకు తీవ్రగాయాలపై అక్కడికక్కడే మృతిచెందాడు. హోబ్యానాయక్‌కు గాయాలుకాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ వేణుకుమార్‌ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం

మోమిన్‌పేట: రైలు కింద పడి ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన మోమిన్‌పేటలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన దాసరి రాజు(36) శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి గ్రామ శివారులోని రైల్వే చిన్న ఖాన దగ్గర రైలు కింద పడి మృతి చెందాడు. రైల్వే పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ హరిప్రసాద్‌ శవ పంచానామా నిర్వహించారు. పోస్టు మార్టం నిమిత్తం వికారాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement