షాద్‌నగర్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని పెండింగ్ ప్రాజెక్టుల ఉద్యమ వేదిక చైర్మన్ రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ఎన్నికల సమయంలో పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లయినా పనులు ముందుకు సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పది శాతం పనులే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పింది.. కానీ నేటికీ పది శాతం పనులు కూడా పూర్తి కాలేదని విమర్శించారు. రెండు రోజులుగా ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ కలియ తిరుగుతున్నామని చెప్పారు. షాద్‌నగర్ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ పనులు ప్రారంభించలేదన్నారు ఈ రిజర్వాయర్ పూర్తి చేస్తేనే షాద్‌నగర్ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగిరం చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు పాలమూరు ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేసేలా చూడాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవులు, నాయకులు టీజీ శ్రీనివాస్, రామారావు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పూర్తిచేస్తేనే షాద్‌నగర్ సస్యశ్యామలం
హామీలు నెరవేర్చకుంటేఉద్యమం ఉధృతం చేస్తాం
పెండింగ్ ప్రాజెక్టుల ఉద్యమ వేదిక చైర్మన్ రాజేందర్‌రెడ్డి


