ప్రధాన పార్టీకి 12 ఓట్లు!
ఇబ్రహీంపట్నం: పట్టణంలోని 24వ వార్డులో 133 చెల్లని ఓట్లు, నోటాకు 56 ఓట్లు పడ్డాయి. 15వ వార్డులో నోటాకు ఒక్క ఓటు కూడా పడలేదు. 18వ వార్డులో చెల్లని ఓట్లు నమోదుకాలేదు. ఇదిలా ఉండగా, 9వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి కర్నె అరవింద్‌కు కేవలం 12 ఓట్లు రావడం గమనార్హం.
బీజేపీ పట్టణ అధ్యక్షుడి రాజీనామా
పార్టీ ఓటమికి నైతిక బాధ్యత
వహిస్తూ నిర్ణయం
షాద్‌నగర్: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు హరిభూషణ్ పటేల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్‌కు రాజీనామా పత్రం అందజేసినట్లు తెలిపారు. సాధారణ కార్యకర్తగా కొనసాగుతూ పార్టీ బలోపేతానికి పాటుపడుతానని ప్రకటించారు. ఇదిలా ఉండగా షాద్‌నగర్‌లోని 10వ వార్డు నుంచి పోటీచేసిన అతని భార్య భాగ్యలక్ష్మి ఓటమి పాలయ్యారు. ఈక్రమంలో పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ హరిభూషణ్ పటేల్‌కు సంబంధించిన ఓ వీడియో స్థానిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హ్యాట్రిక్ విజేత ఓటమి
తాండూరు: వరుసగా మూడు సార్లు మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలిచి, హ్యాట్రిక్ సాధించిన బొబ్బిలి శోభారాణి శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో ఓటమి పాలయ్యారు. 15వ వార్డు అంబేడ్కర్ నగర్ నుంచి ఏకధాటిగా 15 ఏళ్ల పాటు కౌన్సిలర్‌గా కొనసాగిన ఆమె కాంగ్రెస్ అభ్యర్థి దివిటి ఎల్లప్ప చేతిలో ఓటమి చవి చూశారు. ఈవార్డు నుంచి శోభారాణితో పాటు మైనార్టీ నాయకుడు బషరత్ బీఆర్‌ఎస్ టికెట్ ఆశించారు. బీఫామ్ దక్కకపోవడంతో రెబల్ అభ్యర్థిగా నిలిచారు. కౌంటింగ్‌లో శోభారాణికి 314 ఓట్లు రాగా, బషరత్‌కు 559 ఓట్లు వచ్చాయి. వీరిద్దరి పోరుతో కాంగ్రెస్ అభ్యర్థి ఎలప్ప 582 ఓట్లు సాధించి, విజయకేతనం ఎగరేశారు.
యువకుడిపై దాడి
కుల్కచర్ల: ఇచ్చిన అప్పు చెల్లించాలని కోరిన ఓ యువకుడిని మరో ఇద్దరు యువకులు దాడి చేసి గాయరిచారు. ఈ ఘటన కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండీడు మండలం కొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఘణాపూర్ గేటు వద్ద ఉన్న సమయంలో అంతారం గ్రామానికి చెందిన మనోజ్, విష్ణులు అతడితో గోడవ పడ్డారు. శ్రీకాంత్‌కు తీవ్రంగా గాయాలైయ్యాయి. ఇచ్చిన అప్పు చెల్లించాలని కోరగా తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు.
ప్రధాన పార్టీకి 12 ఓట్లు!


