నెలాఖరులోగా టెన్త్ ఫలితాలు
ముగిసిన పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. మార్కుల జాబితాను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. నెలాఖరులోగా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ స్పష్టం చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనంలో 1,100 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే సుమారు రెండు లక్షల జవాబు పత్రాలను దిద్ది రికార్డు సృష్టించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం ఇవ్వలేదని ఆ శాఖ ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా విద్యార్థుల మార్కుల జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరిచే ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు గురువారంతో ముగిశాయి. శనివారం నుంచి ఆయా పాఠశాలలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. అయితే ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు మాత్రం ఈ నెల 24 వరకు హాజరు కానున్నారు.
ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు పదోన్నతి
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్న ఎన్.బాలకృష్ణకు పదోన్నతి లభించింది. రాష్ట్రంలోని పలువురు కమిషనర్లను గ్రేడ్–2 ఉద్యోగులుగా గుర్తించిన ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు సైతం ప్రమోషన్ దక్కింది. పదోన్నతి రావడంతో గ్రూప్–1 అధికారి హోదాకి చేరుకోవడం జరిగిందని.. ఈ హోదా తన బాధ్యతను మరింత పెంచిందని బాలకృష్ణ తెలిపారు.
నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు
ఆమనగల్లు: ఎరువుల డీలర్లు, ఫర్టిలైజర్ షాపుల డీలర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి బి.నర్సింహారావు అన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆమనగల్లు పట్టణంలోని పలు ఫర్టిలైజర్ షాపులను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాకు రిజిస్టర్లు, బిల్ బుక్స్, స్టాక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే సీజన్‌కు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఆయా మండలాలకు అవసరమైన ఎరువులు, విత్తనాలను ముందుగా తెచ్చుకోవాలని, సీజన్ ప్రారంభం నాటికి విక్రయానికి సిద్ధంగా ఉంచాలని సూచించారు. నకిలీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. స్టాక్ రిజిస్టర్లలో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
సామాజిక తనిఖీలు పక్కాగా జరగాలి
యాచారం: ఈజీఎస్ సామాజిక తనిఖీల కార్య క్రమం పక్కాగా జరగాలని జిల్లా విజిలెన్స్ అధికారి కొండయ్య అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏడాది పాటు జరిగిన ఉపాధి పనులకు సంబంధించి తనిఖీల సిబ్బందికి రికార్డులు అందజేయాలని సూచించారు. కూలీలతో కలిసి పనులు చూపించాలని, పనుల్లో అవకతవకలు, అక్రమాలు జరిగితే బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈజీఎస్ అధికారులు రికార్డులు అందజేస్తే త్వరలో తనిఖీల సిబ్బంది గ్రామాలకు వచ్చి గ్రామ సభలు నిర్వహిస్తారని తెలిపారు. సర్వే పక్కగా ఉండాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, ఈజీఎస్ ఏపీఓ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.


