నాలుగు పోస్టులు.. ఒక్కరే అధికారి!
వేధిస్తున్న ఉద్యోగుల కొరత
● పదేళ్లుగా నియామకాలు నిల్
● 40 మంది పని చేయాల్సిన చోట 15 మందే..
● సీఈఐజీ గుప్పిట్లోనే కీలక పోస్టులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారి కార్యాలయంలో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. పదేళ్లుగా కొత్త నియామకాలు లేకపోవడం.. ఉన్నవాళ్లకు పదోన్నతులు రాకపోవడంతో కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ గవర్నమెంట్, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ హైదరాబాద్, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ రూరల్, ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ నిజామాబాద్ పోస్టుల్లో ఒక్కరే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఇప్పటికే ఉన్న 17,130 హెచ్‌టీ కనెన్షన్లకు పీరియాడికల్ ఇన్‌స్పెక్షన్లు నిర్వహించడంతోపాటు కొత్తగా పుట్టుకొచ్చే చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు, సినిమా థియేటర్లు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, హోటల్స్, ఐటీ, అనుబంధ సంస్థల కార్యాలయాలు, క్రషర్ మిషన్లు, రెడీమిక్స్ ప్లాంట్లు, గృహ, వాణిజ్య బహుళ అంతస్తుల భవన సముదాయాలను తనిఖీ చేసి వాటికి అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది.
● కీలకమైన పోస్టులన్నీ ఖాళీగా ఉండడం, ఒక్కరే ఈ బాధ్యతలన్నీ నిర్వర్తించాల్సి రావడంతో అనుమతుల జారీలో తీవ్ర జాప్యం నెలకొంటోంది.
థర్డ్‌పార్టీ నివేదికలను గుడ్డిగా అనుసరిస్తూ..
● విద్యుత్ పనుల్లో నాణ్యత ప్రమాణాల పెంపు, ప్రమాదాల నియంత్రణ కోసం ప్రభుత్వం విద్యుత్ ప్రధాన తనిఖీ అధికారి విభాగాన్ని ఏర్పాటు చేసింది. 75 కేవీఏ సామర్థ్యం దాటిన ఏదైనా బహుళ అంతస్తుల భవనం సహా పరిశ్రమలకు విద్యుత్ కనెక్షన్లను జారీ చేయాలంటే ముందు ఈ సీఈఐజీ అనుమతి తప్పనిసరి. అధికారులు తమ తనిఖీల్లో భాగంగా ఎర్తింగ్, వైరింగ్, బ్రేకర్స్ పని తీరు, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్స్, లైటింగ్ ఎరిస్టర్స్ ఎర్తింగ్, హెచ్‌టీ, ఎల్టీ ప్రొటక్షన్స్, ట్రాన్స్‌ఫార్మర్ ప్రైమరీ, సెకండరీ ప్రొటక్షన్స్‌ను పరిశీలించాల్సి ఉంది.
● ఐఎస్‌ఐ ప్రమాణాల మేరకు ఆయా సాంకేతిక పరికరాలను, కేబుళ్లు, స్విచ్ బోర్డులు వాడారా లేదో? పరిశీలించాలి. నిర్దేశిత ప్రమాణాల మేరకు అన్ని ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే ఆయా భవనాలు, పరిశ్రమలకు అనుమతులు జారీ చేయాల్సి ఉటుంది. అయితే సిబ్బంది కొరతతో థర్డ్‌పార్టీ సమర్పించిన నివేదికను గుడ్డిగా అనుసరిస్తున్నారు. క్షేత్రస్థాయి వరకు వెళ్లినా.. కారు దిగకుండానే ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు.
అడ్డుకుంటూ.. అడ్డగోలుగా సంపాదిస్తూ..
డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ హైదరాబాద్ పరిధిలో రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు ఉంటాయి. డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ రూరల్ పరిధిలో మెదక్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ నిజామాబాద్ పరిధిలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి.
● 2014 నుంచి కొత్త నియామకాలు లేకపోవడంతో 15కు పైగా ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేవీ కనెక్షన్లు 16,140 వరకు ఉండగా, 33 కేవీఏ కనెక్షన్లు 883 వరకు ఉన్నాయి. 132కేవీ కనెక్షన్లు 107 వరకు ఉన్నాయి. మెజార్టీ కనెక్షన్లు గ్రేటర్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. పీరియాడికల్ ఇన్‌స్పెక్షన్లలో భాగంగా ఒక్కో అధికారి రోజుకు సగటున 50 కనెక్షన్లను తనిఖీ చేయాల్సి వస్తోంది. వీటితో పాటు కొత్తవాటికి అనుమతులు జారీ చేయాలి. కొంత మంది అధికారులు ఒకే చోట ఏళ్లుగా పాతుకుపోయారు. సమాన కేడర్‌లో పని చేస్తున్న తోటి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి, పోస్టులు కట్టబెట్టే అవకాశం ఉన్నా.. తమకున్న ఆర్థిక పలుకుబడితో వాటికి అడ్డుపడుతున్నట్లు తెలిసింది. ఫలితంగా కొత్తవాళ్లకు అవకాశాలు లేకుండా పోతుండటంతో పాటు ఏళ్లుగా పాతుకుపోయిన వాళ్లు అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.


