ఘనంగా గరుడ వాహన సేవ
కొడంగల్: పేదల తిరుపతిగా పేరుగాంచిన పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వైఖానస ఆగమ శాస్త్రోకంగా తిరుమల తరహాలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి సర్వభూపాల వాహనంపై ఊరేగిన శ్రీవారు ఆదివారం ఉదయం మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 10 గంటలకు భూదేవి శ్రీదేవి సమేతంగా గరుడ వాహనంపై ఆసీనులైన శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. జాతర స్థలం వరకు కొనసాగిన ఈ ఊరేగింపు ఆద్యంతం గోవింద నామస్మరణతో కొనసాగింది. అర్ధరాత్రి వేంకటేశ్వరస్వామి జాతర స్థలంలో లంకా దహన కార్యక్రమం వైభవంగా జరిగింది. టపాసులు వెలుతురులు ఆకాశంలో కనువిందు చేశాయి. చైన్నె నుంచి ప్రత్యేకంగా తెప్పించిన టపాసులతో లంకాదహనం నిర్వహించారు.


