ఆమనగల్లు: మున్సిపాలిటీ పరిధిలోని ముర్తుజపల్లి గ్రామంలో ఇటీవల మేకలను అపహరించిన ముగ్గురు బాల నేరస్తులను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు. గ్రామానికి చెందిన బైకని రాజయ్యకు చెందిన 8 మేకలను ఈనెల 21న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు. అనంతరం విచారణ జరిపి మేకలను అపహరించిన ముగ్గురు బాల నేరస్తులను అరెస్టు చేసి, కారును సీజ్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఫిలింసిటీలో పేదలకు భూములివ్వాలి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనునాయక్
షాద్‌నగర్: రామోజీ ఫిలింసిటీలో పేదలకు కేటాయించిన భూములను వెంటనే వారికి పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని నాగన్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 189, 203లలోని భూమిలో గతంలో ప్రభుత్వం 577 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిందని.. ఈ భూములను రామోజీ ఫిలింసిటీ యాజమాన్యం కబ్జా చేసిందని ఆరోపించారు. పేదలకు మరో చోట భూములు ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. పేదలకు తమకు కేటాయించిన భూముల వద్దకు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకుని లాఠీచార్జ్ చేయడం తగదన్నారు. పేదల పక్షాన పోరాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి యాదయ్య, పలువురు నాయకులను పోలీసులు గాయపరిచి అరెస్టు చేయడం సిగ్గు చేటన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


