హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి జైలు శిక్ష
షాబాద్: పాత కక్షలను మనసులో పెట్టుకొని వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించిన నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు జడ్జి తీర్పునిచ్చారు. ఈ సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బొబ్బిలిగామ గ్రామానికి చెందిన మోక్కొండ వెంకటయ్య అదే గ్రామానికి చెందిన చిలకమర్రి నరసింహను పాత కక్షలను మనసులో పెట్టుకొని 2014లో కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో నరసింహ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. పూర్వాపరాలు పరిశీలించిన జిల్లా కోర్టు జడ్డి నిందితుడికి ఐదేళ్ల కారాగార శిక్ష, రూ.3.51 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
శివాలయంలో
అర్ధరాత్రి చోరీ
శంకర్‌పల్లి: శివాలయంలో అర్ధరాత్రి దొంగలు పడి, వెండి ఆభరణాలు, హుండీలోని నగదు దోచుకెళ్లిన సంఘటన శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని సింగాపురం శివాలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. తలుపులు పగలగొట్టి లోపల సుమారు 2కిలోల వెండి ఆభరణాలు, హుండీలోని నగదును అపహరించుకోని వెళ్లారు. అర్చకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కొంతకాలంగా పని చేయడం లేదు.
మద్యానికి బానిసై చోరీల బాట
దోమ: మేకను అపహరించేందుకు యత్నించిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని బుద్లాపూర్ గ్రామానికి చెందిన చాకలి ముకుంద్(37) హైదరాబాద్‌లో పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన ఆయన కొన్ని రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చాడు. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన బురాన్‌పూర్ నర్సింలు అనే వ్యక్తి మందలో ఓ మేకను అపహరించేందుకు వెళ్లాడు. ఆ మేక అరవడంతో గమనించిన నర్సింలు బయటకి వచ్చి చూశారు. ఇది గమనించి మందలోనే నక్కి కూర్చున్నాడు. స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గతంలోనూ నర్సింలు కట్టేసి ఉంచిన మేకలు అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముకుంద్ పరిగి పట్టణంలో ఓ బైక్ చోరీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి జైలు శిక్ష


