‘పట్నం’ పీఎస్‌లను ఒకే కమిషనరేట్‌లో ఉంచాలి
సీఎం, డీజీపీకి ‘మంచిరెడ్డి’ లేఖ
ఇబ్రహీంపట్నం రూరల్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని పోలీస్ స్టేషన్లన్నీ ఒకే కమిషనరేట్ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ శివధర్‌రెడ్డికి లేఖ రాశారు. ఫార్మాసిటీ పీఎస్‌ను మేడిపల్లి లేదా కుర్మిద్దలో ఏర్పాటు చేయాలని, మహేశ్వరం డివిజన్‌లో కాకుండా ఇబ్రహీంపట్నం ఏసీపీ పరిధిలోనే కొనసాగించాలని పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ స్టేషన్‌ను వనస్థలిపురం నుంచి ఇబ్రహీంపట్నం ఏసీపీ పరిధిలోకి తీసుకోవాలని కోరారు. ఆదిబట్ల పీఎస్‌ను హైదరాబాద్ కమిషనరేట్‌లో చేర్చడం సరికాదని, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌లోనే కొనసాగించాలని సూచించారు.


