అభివృద్ధి కోసం ఏ త్యాగానికై నా సిద్ధం
జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి
ఆమనగల్లు: అభివృద్ధి కోసం ఏ త్యాగం చేయడానికై నా సిద్ధంగా ఉన్నానని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి అన్నారు. డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతామని ప్రకటించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కల్వకుర్తి ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే సదావకాశం సీఎం రేవంత్‌రెడ్డికి దక్కిందని అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాయలసీమ ప్రాంతాన్ని, కేసీఆర్ సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలను అబివృద్ధి చేశారని అదేవిధంగా రేవంత్‌రెడ్డి కల్వకుర్తిని జిల్లాగా ప్రకటించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కండె హరిప్రసాద్, పట్టణ బీజేపీ అధ్యక్షుడు విక్రంరెడ్డి, మాజి కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
డంపింగ్‌యార్డు తొలగించాలి
ఆమనగల్లు పట్టణంలో నివాస గృహాల మధ్య ఉన్న డంపింగ్‌యార్డును తొలగించాలని బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. నివాసాల మధ్య డంపింగ్‌యార్డుతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. తరలించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. వారికి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కేకే శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కర్నాటి విక్రంరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దుర్గయ్య, మాజీ కౌన్సిలర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.


