మేనిఫెస్టో హామీలు అమలు చేయండి
మహేశ్వరం: కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతీ నెల రూ.5వేల గౌరవ వేతనం, క్వింటాల్‌కు రూ.300 చొప్పున కమీషన్ ఇవ్వాలని రేషన్ డీలర్లు కోరారు. ఈ మేరకు బుధవారం వారు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రి శ్రీధర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న రేషన్ డీలర్లకు హెల్త్ కార్డులు అందించాలని, రేషన్ డీలర్లు చనిపోతే దహనసంస్కారాలకు ప్రభుత్వం రూ.25వేలు చెల్లించాలని కోరారు. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ఆథరైజేషన్ రెన్యూవల్, గతంలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన మాదిరిగానే తొమ్మిది సరుకులు పంపిణీ చేయాలని విన్నవించారు. ఇందుకు స్పందించిన స్పీకర్, మంత్రి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పులిమామిడి లక్ష్మీనారాయణ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భానుచందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్
స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రి శ్రీధర్‌బాబుకు వినతిపత్రాల అందజేత


