కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఓ పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన సంఘటన మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు చెందిన సక్కుబాయి (38), పాండు దంపతులు. సక్కుబాయి మహేశ్వరం మండలం ఎన్‌డీతండా పంచాయతీ కార్యదర్శిగా, పాండు అంబర్‌పేట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం ఇద్దరూ కలిసి సక్కుబాయి అమ్మగారి గ్రామమైన కొందుర్గుకు స్కూటీపై వచ్చారు. గ్రామంలో గతంలో వారు కొనుగోలు చేసిన వ్యవసాయ క్షేత్రంలో చేపడుతున్న పండ్లతోట పనులు చూసి తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యలో తిమ్మాపూర్ వద్దకు రాగానే హెచ్‌పీ పెట్రోల్‌బంకు వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. అదే సమయంలో లారీ అదుపుతప్పి పక్కనుంచి వెళ్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీచక్రాలు బైకుపై నుంచి వెళ్లడంతో సక్కుబాయి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన పాండును చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
భర్తకు తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి