
షాద్‌నగర్‌కు ‘లక్ష్మీదేవి’ కటాక్షం
షాద్‌నగర్: సాగు సస్యశ్యామలానికి గంగమ్మ తల్లి కావాలి.. గంగమ్మ తల్లి రాకకు లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి. షాద్‌నగర్ రైతులకు లక్ష్మీ కళను ఇచ్చేది లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైతుల కల ఎట్టకేల కు సాకారం కాబోతుంది. గతంలో పాదయాత్రలో భాగంగా ఈ రిజర్వాయర్ స్థలాన్ని స్వయంగా పరిశీలించి సాగు నీటి అవసరాలను గుర్తించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రిజర్వాయర్ కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ఇదీ ఆరంభం
నియోజకవర్గ రైతులకు నీటి వనరులు లేక కేవలం చెరువులు, బోర్ల ఆధారంగానే సాగు చేపట్టారు. చౌదరిగూడ మండలం లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని, తా ము అధికారంలో వస్తే తొలి ప్రాధాన్యత ఇస్తామని మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో ప్రకటించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు లో అంతర్భాగమైన ఈ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయ ర్‌ను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు నల్గొండ జిల్లాకు విస్తరించనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. రిజర్వాయర్ నిర్మాణానికి చేపట్టిన మూడు సర్వేలు కార్యరూపం దాల్చలేదు.
మొత్తానికి మోక్షం
వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యేగా గెలుపొందాక రిజర్వా యర్ నిర్మాణం విషయమై పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం రూ.266.65కోట్లతో పాలనాపరమైన అను మతి ఇచ్చినట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ నేతలతో పాటుగా, నియోజకవర్గ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి అయితే సాగునీటి కష్టాలు తీరుతాయని రైతులు తమ ఆనందాన్ని వెల్లిబుచ్చుతున్నారు. రిజర్వాయర్ కోసం ఎంతో కృషి చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు స్ధానిక నేతలు అభినందనలు తెలిపారు.
రిజర్వాయర్ నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు
రూ.266.65 కోట్ల నిధులు కేటాయింపు
బడ్జెట్‌లో భట్టి ప్రకటనతో రైతన్నల్లో ఆనందం
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషికి ప్రశంసలు
ఆందోళనలకు అందరి మద్దతు
గత ప్రభుత్వం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ విషయంలో ఆశించిన స్థాయిలో ముందడుగు వేయ లేదు. దీంతో వివిధ పార్టీలు రిజర్వాయర్ నిర్మించాల్సిందేనని ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుత ఎమ్మె ల్యే వీర్లపల్లి శంకర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం పోరాడారు. 2018 ఎన్నికల్లో ఇక్కడ ప్రచారానికి వచ్చిన కేసీఆర్ రెండవ సారి అధికారంలోకి వస్తే కుర్చీ వేసుకొని ఈ రిజర్వాయర్‌ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ పనుల్లో ఎటువంటి పురోగతి లేదు. రిజర్వాయర్ నిర్మించే స్థలాన్ని గతంలో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా సందర్శించగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్, వైఎస్ షర్మిల, కోదండరాం, గద్దర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆందోళనలకు మద్దతిచ్చారు.