షాద్‌నగర్: విదేశీ ప్రయాణం అంటే సంతోషంగా ముందుకు సాగుతారు.. అక్కడే స్థిరపడి, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన పిల్లలు, బంధువులను చూసేందుకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతారు. కానీ కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్‌రెడ్డి, పవిత్ర దంపతుల అమెరికా ప్రయాణం కన్నీటి మయమైంది. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తమ కూతురు ప్రగతిరెడ్డి, మనవడు హర్వీన్‌రెడ్డి, వియ్యంకురాలు సునీతారెడ్డిని చివరిసారిగా చూసేందుకు మంగళవారం వారు బయల్దేరారు. ఈ క్రమంలో టేకులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కూతురు, మనుమడిని తలచుకుంటూ బాధితులు రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. మృతదేహాలను ఇండియా తెప్పించేందుకు వీలు కావడంలేదని, అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రగతి అత్తింటి వారి నుంచి సమాచారం రావడంతో బరువెక్కిన హృదయాలతో వెళ్లారు.
పలువురి పరామర్శ
అమెరికాకు పయనమైన మోహన్‌రెడ్డి దంపతులు టేకులపల్లి నుంచి నగరంలోని కొత్తపేటలో ఉన్న తమ నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌కుమార్‌రెడ్డి వీరిని కలిసి ఓదార్చారు.