● మొండిగౌరెల్లి రైతుల తీర్మానం
యాచారం: పారిశ్రామిక పార్కుల పేరుతో అసైన్డ్, పట్టా భూములను బలవంతంగా తీసుకుంటామంటే ఊరుకునేది లేదని, ప్రాణం పోయినా భూములిచ్చేది లేదని మొండిగౌరెల్లి గ్రామ రైతులు స్పష్టంచేశారు. నేలతల్లిని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న తమ భూములను గుంజుకుంటామంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. పారిశ్రామిక పార్కులకోసం గ్రామంలోని పలు సర్వేనంబర్లలోని 822 ఎకరాల భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రైతులు సోమవారం జీపీ కార్యాలయం ఎదుట సమావేశం అయ్యారు. సర్కారు భూములు తీసుకోకుండా అడ్డుకుందామని, సమష్టిగా పోరాటం చేద్దామని తీర్మానించారు. ఇందులో భాగంగా టి.రవీందర్, బి.కృష్ణ, సందీప్‌రెడ్డి, సంగెం రవి, ప్రవీణ్‌కుమార్‌లతో పాటు మరో 30 మందితో కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు, తహసీల్దార్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, కలెక్టర్‌కు వినతిపత్రాలు, న్యాయపరంగా కోర్టుకు వెళ్లడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. మాజీ సర్పంచ్ అంజయ్య యాదవ్, రైతులు మేకల యాదగిరిరెడ్డి, శ్రీనివాస్ యాదవ్, బాలరాజ్, జంగయ్య, శ్రీకాంత్‌రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.