ఆమనగల్లు: బైక్‌ను చో రీ చేసిన వ్యక్తిని శనివారం రిమాండ్‌కు తరలించినట్లు ఆమనగల్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని విఠాయిపల్లి గ్రామానికి చెందిన సబావత్వాల్య గత ఏడాది డిసెంబర్లో తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ఎదుట పార్క్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన హాజీ బైక్‌ను చోరీ చేసినట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హాజీని కోర్టులో హాజరు పర్చి, రిమాండ్‌కు తరలించారు.
చికిత్స పొందుతూ గర్భిణి మృతి
వైద్యుల నిర్లక్ష్యమంటూ బంధువుల ఆరోపణ
శంషాబాద్ రూరల్: ఛాతి నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ గర్భిణి మృతి చెందింది. ఇన్స్పెక్టర్ నరేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం అమీర్‌పేట్ నివాసి బుషమోని ప్రమీల(33) 9 నెలల గర్భిణి. మొదటి నుంచి ముచ్చింతల్ శివారులోని జిమ్స్ ఆస్పత్రిలో వైద్య చికిత్స పొందుతుంది. నెలలు నిండడంతో ప్రమీలను ఈ నెల 11న జిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 13వ తేదీ వరకు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమెను వైద్యులు ఇంటికి పంపించారు. 18న ఆస్పత్రికి రావాలంటూ డాక్టర్ పూజిత కొన్ని మందులు రాసిచ్చారు. శుక్రవారం రాత్రి ప్రమీల భోజనం తర్వాత వైద్యులు ఇచ్చిన మందులు వేసుకుంది. కాసేటి తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో భర్త సాయిబాబు ఆమెను రాత్రి 10.30 గంటలకు జిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ సమయంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులు ఆమెను పరిశీలించారు. 12.15 గంటలకు డాక్టర్ రామారావు ఆమెను పరీక్షించగా అప్పటికే చనిపోయింది. సకాలంలోవైద్యం అందక తన భార్య మృతి చెందిందని, ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సాయిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.