పట్టాలు
అడ్డుపెట్టి
మొయినాబాద్: చెరువులు, కుంటలు, నాలాలను పరిరక్షించాలని ఓ వైపు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తుంటే కొందరు మాత్రం చెరువులనే మాయం చేసేస్తున్నారు. చెరువు కట్టను పూర్తిగా తొలగించి, ఆనవాళ్లు లేకుండా చేసే పనిలో ఉన్నారు. మొయినాబాద్ మండలంలోని బాకారం జాగీర్ రెవెన్యూలో ఈ తతంగం సాగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. బాకారం జాగీర్ రెవెన్యూలోని సర్వే నంబర్ 11, 12లో జంబులకుంట చెరువు ఉంది. 21 ఎకరాల్లో విస్తరించిన ఉన్న చెరువు భూమిలో శిఖం పట్టాలున్నాయి. చెరువులోని నీళ్లు ఇంకిపోయినప్పుడు మాత్రమే సంబంధిత వ్యక్తులు ఇందులో పంటలు సాగు చేసుకోవాలి. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. ఇతర అవసరాలకు సైతం వాడుకోవద్దు. కానీ కొంతమంది ఈ నిబంధనలను పట్టించుకోకపోవడంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. శిఖం పట్టాలను అడ్డం పెట్టుకుని కొందరు చెరువు ఆనవాళ్లకే ఎసరు పెడుతున్నారు. ఈ క్రమంలో కట్టను పూర్తిగా తొలగించారు. ఈ విషయం గుర్తించిన స్థానికులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. చెరువును కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేస్తున్నారు
జంబులకుంట చెరువులో నిబంధనలకు విరుద్ధంగా పనులు
శిఖం పట్టాలను అడ్డం పెట్టుకుని కట్టను ధ్వంసం చేస్తున్న వైనం
చెరువు ఆనవాళ్లను మాయం చేసేలా కుట్ర
ఇరిగేషన్ అధికారులకుఫిర్యాదు చేసిన స్థానికులు