ప్రేమలో గెలిచి.. బతుకులో ఓడారు | - | Sakshi
Sakshi News home page

ప్రేమలో గెలిచి.. బతుకులో ఓడారు

Jun 14 2023 7:26 AM | Updated on Jun 14 2023 8:07 AM

- - Sakshi

హైదరాబాద్: వారిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. చేసేదేమీలేక ఇద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు. ఆర్నెల్లుగా వేరే కాపురం పెట్టారు. ఈ క్రమంలో మనోవేదనతో పాటు ఆర్థిక ఇబ్బందులతో ఆ నవ దంపతులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. దహన సంస్కారం కోసం ఇరు కుటుంబాలు వేర్వేరుగా ఆ యువతీ యువకుల మృతదేహాలను తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ప్రేమించి.. పెళ్లి చేసుకుని.. జీవితంలో ఒక్కటైన ఆ జంట..చివరకు మృత్యువులోనూ నీతోనే నేనంటూ కన్నుమూశారు.మృతదేహాలను వేర్వేరుగా ఎవరి కుటుంబం వాళ్లు తీసుకెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. ప్రేమలో గెలిచి.. పెళ్లితో ఒక్కటై జీవితం పంచుకున్న ఈ జంట.. చివరకు విడిపోయి చితికి చేరిన ఘటన మంగళవారం కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అహ్మద్‌గూడ ఆర్‌జీకే కాలనీలో చోటుచేసుకుంది. కీసర సీఐ రఘువీర్‌రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. మూడుచింతలపల్లి మండలం కేశవపురం గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు (25) నగరంలోని కాప్రా జమ్మిగడ్డకు చెందినవైష్ణవి (22) ప్రేమించుకుని ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు.

ఇరు కుటుంబాల వాళ్లకు దూరంగా నాలుగు నెలల నుంచి అహ్మద్‌గూడలోని ఆర్‌జీకే కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆంజనేయులు, వైష్ణవి వేర్వేరుగా బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.

ఆమె ఉరి వేసుకుని.. అతను పురుగుల మందు తాగి
మొదట వైష్ణవి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది. ఆ తర్వాత ఆంజనేయులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాము బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు యువ జంట రాసిన సూసైడ్‌ నోట్‌ పోలీసులకు లభించింది. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా..పోస్టుమార్టమ్‌ అనంతరం మృతదేహాలను ఎవరి కుటుంబ సభ్యులు వారు తీసుకెళ్లారు. ఆంజనేయులు మృతదేహాన్ని కేశవపురానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయగా.. వైష్ణవి మృతదేహాన్ని జమ్మిగడ్డకు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రేమలో గెలిచి.. పెళ్లి ఒక్కటై.. మృతిలో తోడుగా ఉండి.. ఆఖరికి చితిలో మాత్రం వేరయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement