బైక్‌ దొంగ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

బైక్‌ దొంగ పట్టివేత

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

● వాహనం స్వాధీనం

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి పట్టణంలోని తమ్మిశెట్టి రవీందర్‌కు చెందిన బైక్‌ను ఈనెల 19న అపహరించిన కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఎస్సై నరేశ్‌ కథనం ప్రకారం.. కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలం మర్తిడి గ్రామానికి చెందిన బోర్తుడి సంజీవ్‌ వాహన దొంగతనాలు చేస్తూ గతంలోనూ బెజ్జూరు, కాగజ్‌నగర్‌, సిరిసిల్ల, కరీంనగర్‌ ప్రాంతాల్లో చోరీచేసి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లొచ్చాడు. పెద్దపల్లికి చెందిన రవీందర్‌ ఇంటి ఎదుట నిలిపి ఉంచిన బైక్‌ను సైతం అపహరించాడు. మంగళవారం శాంతినగర్‌ శివారు రైల్వే ఓవర్‌బ్రిడ్జి వద్ద వాహనతనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా అప్రమత్తమై అదుపులోకి తీసుకుని విచారించడంతో దొంగతనం విషయం తెలుసుకుంది. నేరాన్ని అంగీకరించడంతో బైక్‌ను స్వాధీనం చేసుకుని, సంజీవ్‌ను అరెస్ట్‌ చేసినట్టు ఎస్సై నరేశ్‌ తెలిపారు.

భూపాల్‌పల్లి డీటీవో వెంకన్న మృతికి నివాళి

జగిత్యాలక్రైం: జిల్లాలో 27నెలలు ఎంవీఐగా పనిచేసి.. పదోన్నతిపై భూపాల్‌పల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా వెళ్లిన వెంకన్న సోమవారం ఉదయం టిప్పర్‌ ఢీకొని మృతిచెందడంతో స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. వరంగల్‌ జిల్లా చేర్యాలకు చెందిన వెంకన్న 2003లో విద్యుత్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం పొందారు. కేటీపీఎస్‌లో బాధ్యతలు నిర్వహిస్తుండగా.. ఏడీఏగా పదోన్నతి పొందారు. ఏపీపీఎస్సీలో పరీక్ష రాసి రవాణా శాఖలో ఎంవీఐగా ఉద్యోగం పొందారు. 15 రోజుల క్రితమే భూపాల్‌పల్లి డీటీవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మృతిపై జిల్లా రవాణా శాఖ అధికారి మహ్మద్‌ సందాని, ఎంవీఐ రామారావు, అసిస్టెంట్‌ ఎంవీఐలు సాయిచరణ్‌, రియాజ్‌లు సంతాపం వ్యక్తం చేశారు.

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు: ముగ్గురికి గాయాలు

మల్యాల: మండలంలోని ముత్యంపేట శివారు.. జగిత్యాల–కరీంనగర్‌ రహదారిపై సోమవారం వేకువజామున ఓ కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ముగ్గురు గాయపడ్డారు. కరీంనగర్‌ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న కారు కొండగట్టు సమీపంలో అదుపు తప్పి, విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో కోరుట్లకు చెందిన నాగరాజు, అనిల్‌, మహమ్మద్‌ గాయపడ్డారు. బాధితులను 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కారు ట్రాక్టర్‌ ఢీ..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని రాచర్ల గొల్లపల్లి శివారులో సోమవారం రాత్రి కారు ట్రాక్టర్‌ ఢీకొంది. వివరాల్లోకి వెళ్తే.. రాచర్ల గొల్లపల్లి శివారు జక్కుల చెరువు నుంచి మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్‌ మెయిన్‌ రోడ్డు పైకి వస్తున్న క్రమంలో కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement