చిగురుమామిడి: మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన రైతు కుందేళ్ళ వెంకటయ్య (48) వడదెబ్బతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. వెంకటయ్య ఆదివారం తన పొలంలో పనులు చేస్తుండగా ఎండ వేడి తట్టుకోలేక స్పృహతప్పి పడిపోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే వెంకటయ్య ఆదివారం మృతిచెందినట్లు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గౌరయ్య తెలిపారు. సోమవారం మృతుడి కొడుకు మల్లికార్జున్ ఫిర్యాదు మేరకు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించినట్లు వివరించారు.
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ నగరంలో ఓ వృద్ధురాలు బావిలో పడి మృతిచెందింది. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. శర్మనగర్‌కు చెందిన నలుమాచు సుగుణమ్మ (80) వయసు మీద పడడంతో కళ్లు, చెవులు సరిగా పనిచేయడం లేదు. సోమవారం వేకువజామున ఇంట్లో వాళ్లు నిద్రలేచి చూసేసరికి సుగుణమ్మ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఇంట్లోని బావిలో చూసేసరికి కనిపించింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుమారుడు రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అప్పుల బాధ తో వ్యక్తి ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): అప్పుల బాధలు తాళలేక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై జ్యోతి తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌కు చెందిన బాలసాని బాలరాజు(40) ఆదివా రం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగేళ్ల క్రితం బాలరాజు భార్య క్యాన్సర్ వ్యాధికి గురై మృతిచెందింది. ఆమె చికిత్స కోసం బాలరాజు రూ.10లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీరే మార్గం లేక మనోవేదనకు గురైన బాలరాజు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వీరి కుమారుడు, కూతురు అనాథలుగా మిగిలారు. నాలుగేళ్ల క్రితం తల్లి, ఇప్పుడు తండ్రి మృతిచెందడంతో చిన్నారులు దిక్కులు చూస్తున్నారు. ప్రభుత్వం, మానవతవాదులు చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతుని బంధువు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జ్యోతి తెలిపారు.


