కరీంనగర్‌క్రైం: పీఎంజే జ్యువెలరీ షోరూంలో జరిగిన దోపిడీ కేసులో కరీంనగర్ పోలీసులు మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కీలకమైన ఆధారాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 8కి చేరింది. ఈ నెల 17న కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీలోకి తీసుకున్న ఐదుగురు నిందితులు సుబోధ్‌సింగ్, రఘునాథ్, రావిష్, అమర్‌సింగ్, జైనుల్లాబ్దీన్ కస్టడీ రేపటితో ముగియనుంది. కస్టడీ విచారణలో భాగంగా నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం మేరకు నేరానికి ఉపయోగించిన టీవీఎస్ అపాచీ బైక్‌ను మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షోరూంలో దోపిడీకి పాల్పడిన ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ కాగా, తాజాగా మూడో వ్యక్తి సూర్యమణి అలియాస్ సనోజ్ కుమార్‌ను కరీంనగర్ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామడుగు మండల శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద గల తాత్కాలిక నిర్మాణ షెడ్ల సమీపంలో కీలక ఆధారాలు సేకరించారు. నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన 5 జతల దుస్తులు, 3 జతల బూట్లు, మూడు నకిలీ టూ వీలర్ ఆర్‌సీ కార్డులు, మొబైల్ ఫోన్, అక్కడే దాచి ఉంచిన పిస్టల్, మ్యాగజైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నిందితుడు ఎండీ ఆదిల్‌ఖాన్‌ను బిహార్ రాష్ట్రం పాట్నాలోని పుల్వారి షరీఫ్ వద్ద కరీంనగర్ ప్రత్యేక పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. ఇతడిని తెలంగాణకు తరలించేందుకు స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. గతంలో అరెస్ట్ అయిన క్రెటాకార్ డ్రైవర్ జైనులబ్దీన్‌కు ఆదిల్‌ఖానే కారు, నిందితులకు తుపాకులను సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. మహమ్మద్ మెహతాబ్‌ఖాన్ నిందితులకు సిమ్ కార్డులు అందించినందుకు అరెస్టయి జైలులో ఉన్నాడు. ఈ నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకోలేదు. ఈ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్‌స్పెక్టర్లు సృజన్‌రెడ్డి, రమేశ్, శ్రీనివాస్, తిరుమల్, ప్రకాష్, ఎస్సై శేఖర్ సిబ్బందిని సీపీ అభినందించారు.


