కరీంనగర్‌సిటీ: హుస్నాబాద్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల వసతి గృహాల సౌకర్యాల కల్పనకు కీలక అడుగు పడింది. శాతవాహన విశ్వవిద్యాలయం 86వ కార్యనిర్వాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇంజినీరింగ్ కళాశాలలో బాలుర, బాలికల హాస్టళ్ల నిర్మాణ పనులు అధికారికంగా మొదలుకానున్నాయని సోమవారం వీసీ ఉమేశ్‌కుమార్ తెలిపారు. రూ.14.56 కోట్ల అంచనాతో రెండు హాస్టళ్ల నిర్మాణ బాధ్యతలను తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించారని పేర్కొన్నారు. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నం.132/1లో 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో వసతి గృహాలను నిర్మించనున్నారు. పనులు వేగవంతంగా ప్రారంభించాలని సంబంధిత అధికారులను వీసీ ఆదేశించారు. నిర్మాణాలకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా విడుదల చేయనుందని, 2027 జూన్ 30 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హాస్టళ్ల నిర్మాణం పూర్తయితే హుస్నాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన వసతి, సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం మరింత సులభతరం కానుందని పేర్కొన్నారు. వసతి గృహ నిర్మాణాలకు నిధులు మంజూరు కావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ధన్యవాదాలు తెలిపారు.


