ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని ఆవునూర్‌లో ప్రాచీన శివాలయం పరిసరాల్లో వందల ఏళ్ల నాటి శిల్పాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు కరిపే రాజ్‌కుమార్ తెలిపారు. సోమవారం గ్రామాన్ని సందర్శించారు. ఆవునూర్‌కు ప్రాచీన చరిత్ర ఉందని, చెరువుకట్ట సమీపంలోని శివాలయ ప్రాంగణంలో చాముండేశ్వరీ విగ్రహం ఉందని, ఇది 14వ శతాబ్దానికి చెందిందని తెలిపారు. పూర్వహస్తాల్లో త్రిశూలం, ఢమరుకం, పరహస్తాల్లో కత్తి, రక్తపాత్రలతో సుఖాసీనస్థితిలో విగ్రహం ఉందని, కరండ మకుటాన్ని ధరించి ఉందని పేర్కొన్నారు. 15వ శతాబ్దానికి చెందిన కాలభైరవుడు జ్వాలాకేశాలతో పూర్వహస్తాల్లో త్రిశూలం, ఢమరుకం కలిగి ఉన్నాడని, పరహస్తాల్లో ఖడ్గం, ఖండిత శిరస్సును కలిగి ఉన్నాడని, నగ్నమొలతో, నడుముకు కపాల మేఖలను ధరించి ఉన్నాడని తెలిపారు. ఖండిత శిరస్సు రక్తపు చుక్కల కోసం కుక్కపైకి దుముకుతున్న దృశ్యాలను శిల్పులు కళ్లకు కట్టినట్లు వివరించారన్నారు. గుడి ప్రాంగణంలో చాళుక్యశైలి పోలిన నంది 12వ శతాబ్దానికి చెందిందన్నారు. సంతానం కోసం ఆరాధించే నాగశిల కూడా ప్రాచీనమైందని తెలిపారు. అమూల్యమైన ప్రాచీనశిల్ప సంపదను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
చాముండేశ్వరీ విగ్రహం
కాలభైరవుడి విగ్రహం
చరిత్ర పరిశోధకుడు రాజ్‌కుమార్


