● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, ఆహార నాణ్యత పరిశీలించారు. కలెక్టర్ డైనింగ్‌హాల్‌లోకి వెళ్లగా విద్యార్థినులు భోజనం చేస్తుండడంతో వారి వద్దకు మెనూ గురించి ఆరా తీశారు. బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. హాస్టల్, విద్యాలయ ఆవరణ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
జనగణనలో జిల్లాకు మొదటి స్థానం
జిల్లా జనగణన –2027 మొదటి దశలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో విజయవంతంగా నిర్వహించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్‌ను జిల్లా అధికారుల ప్రతినిధులు సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జనగణన తొలి దశగృహ జాబితా, గృహాల లెక్కింపు 2026 మే 11న ప్రారంభమై జూన్ 9తో ముగిసింది. రాష్ట్రస్థాయిలో కచ్చితత్వ వివరాల నమోదు, ప్రక్రియను పూర్తి చేయడంతో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల(డోర్స్) అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అఫ్జల్ బేగం, సీపీవో శ్రీనివాసాచారి తదితరులు కలెక్టర్‌ను కలిశారు.
కలెక్టర్‌ను కలిసిన జిల్లా వైద్యాధికారి అంజలా ఆల్ఫ్రెడ్
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అంజలా ఆల్ఫ్రెడ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్‌ను కలిశారు. జిల్లా వైద్యాధికారిగా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు.


