● ఆర్డీవో శ్రీధర్‌బాబుకు సర్పంచుల విన్నపం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గ్రామాలలో ఏళ్ల తరబడిగా రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబును సర్పంచులు కోరారు. ఎల్లారెడ్డిపేట మండల పరిషత్‌లో సోమవారం మండలంలోని వివిధ గ్రామాలకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ప్రజాప్రతినిధులతో కలిసి ఆర్డీవో లబ్ధిదారులకు అందజేశారు. తిమ్మాపూర్ సర్పంచ్ అందె సుభాష్ మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా సాగుచేసుకుంటున్న వారికి సైతం పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆర్డీవో స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులను గుర్తించి భూములకు హక్కుపత్రాలు ఇస్తామన్నారు. తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, మండల సర్పంచ్‌ల ఫోరం కన్వీనర్ దొమ్మాటి నర్సయ్య పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో వెలుగుచూసిన వరి ధాన్యం కుంభకోణంపై విచారణ చేపట్టాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు మారవేణి రంజిత్‌కుమార్ కోరారు. ఈమేరకు మండల కేంద్రంలోని కిషన్‌దాస్‌పేట పోస్టాఫీస్ ద్వారా సోమవారం ఫిర్యాదు చేశారు. రంజిత్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఏళ్లుగా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని కోరారు. ధాన్యం అక్రమాలపై విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ, సివిల్ సప్లయీస్ సంయుక్తంగా ప్రత్యేక విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.


