● డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉండాలి ● సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి
సిరిసిల్ల: విద్యార్థులు సృజనాత్మకతపై దృష్టిసారించాలని, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా గడపాలని సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి కోరారు. జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్‌లో సోమవారం తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించి అవగాహన సదస్సులో డీఎస్పీ పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్, గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగంతో వ్యక్తిగత ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా.. కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి డీఎస్పీ డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలో ఎవరైనా మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలకు పాల్పడినట్లు తెలిస్తే వెంటనే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్ నంబర్ 87126 71111కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు. సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై నాగరాజు, హెచ్‌ఎం శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


