రైతులను తరిగేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

రైతులను తరిగేస్తున్నారు

Jun 21 2026 11:49 PM | Updated on Jun 21 2026 11:49 PM

‘కోనరావుపేట మండలంలోని మూలవాగు అవతలి గ్రామం అది. ఆ ఊరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ యువకుడు ఐదేళ్లుగా బుక్‌కీపర్‌ పని చేస్తున్నాడు. అతడి పేరిట గుంట భూమి లేదు. ధాన్యం కొనుగోళ్లు ఉన్నన్ని రోజుల పాటు రోజూ రూ.400 చొప్పున అతడికి చెల్లిస్తారు. కానీ, సదరు బుక్‌కీపర్‌ బ్యాంకు ఖాతాలో ఒక్కో పంట సీజన్‌లో రూ.5 లక్షలు జమవుతున్నాయి. ఆ బుక్‌ కీపర్‌ ఖాతాకు రైస్‌ మిల్లర్లు డబ్బులు కొడుతున్నారు. ఒక్క బస్తా వడ్లను పండించకున్నా సదరు యువకుడు ఏటా (రెండు పంటల సీజన్లు కలిపి) రూ.10లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ డబ్బుతో రెండు వ్యాన్లను కొన్నాడు. వాటిని మళ్లీ ధాన్యం రవాణాకే కొనుగోళ్ల సమయంలో వినియోగించడం విశేషం.’

‘ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ చైతన్యవంతమైన గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఓ యువకుడు ఆరేళ్లుగా నిర్వహిస్తున్నాడు. రైతులతో ఎంతో నమ్మకంగా ఉంటూ.. ప్రతిసారి తూకం వేసిన ధాన్యం రైస్‌ మిల్లుకు చేరిన తర్వాత కొందరు రైతుల వడ్లను ‘తరుగు’ పేరిట కోత విధిస్తున్నారు. ఒక్క రైతు వంద బస్తాల వడ్లను అమ్మితే.. ఐదారు బస్తాల తరుగువచ్చిందని చెబుతూ.. అతనికి రావాల్సిన వడ్ల డబ్బుల్లో కోత పెడుతున్నారు. ఆ తరుగు డబ్బులు తిరిగి రైస్‌ మిల్లర్‌ సదరు కొనుగోలు కేంద్రం నిర్వాహకుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. ఇలా వచ్చిన డబ్బుతో కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు రెండు అంతస్తుల బిల్డింగ్‌ను నిర్మించడం విశేషం.’

కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే అక్రమార్కులు మిల్లర్లతో కలిసి నొక్కేస్తున్నారు

జిల్లాలో ధాన్యం కొను‘గోల్‌మాల్‌’ లారీ కొద్ది అక్రమాలు.. రూ.91లక్షలను నొక్కేశారు

ఆరుగురి అరెస్ట్‌.. పరారీలో మరికొందరు లోతుగా విచారిస్తే.. మరిన్ని అక్రమాలు వెలుగులోకి..

‘వీర్నపల్లి మండలంలోని ఓ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకురాలు రైతుల వడ్ల బస్తాలను తన పేరిట నమోదు చేసుకుంటూ ట్యాబ్‌ ఎంట్రీ చేసింది. ఆ మేరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సిన రూ.16లక్షలు దారి మళ్లించింది. పౌరసరఫరాల, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఆలస్యంగా గుర్తించి ఆ డబ్బులను రికవరీ చేశారు. సదరు నిర్వాహకురాలిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. కానీ, అంతకు ముందు కూడా ఆమె ఇలాగే అక్రమాలకు పాల్పడిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.’ ఇలా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయి.

సిరిసిల్ల: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవాలని రైతులు భావిస్తుండగా.. ఇదే అదనుగా అక్రమాలకు కొందరు తెరలేపుతున్నారు. రైతులు అమ్మిన ధాన్యం బస్తాల్లో రాళ్లు, తాలు ఉందని పేర్కొంటూ.. రైస్‌ మిల్లర్లు ‘తరుగు’తీస్తున్నారు. మిల్లుకు చేరిన బస్తాల్లో భారీగా కోత విధించడంతో ఆ మేరకు రైతులకు నష్టం జరుగుతుంది. కానీ, ఆ శ్రీతరుగుశ్రీలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కాసుల పంట పండిస్తున్నారు. రైతులతో నమ్మకంగా ఉంటూనే తరగు వచ్చింది.. ఏం చేస్తామంటూ నమ్మబలుకుతూ.. రైస్‌ మిల్లర్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకుంటూ డబ్బులు దండుకుంటున్నారు. మరోవైపు గోదాముల్లో నిల్వ చేస్తున్న ధాన్యంలోనూ కోతలు పెడుతూ కాసుల పంటలు పండించుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కో ధాన్యం బస్తాను 40.600 కిలోల బరువుతో తూకం వేయాల్సి ఉండగా, అంతకు రెండు నుంచి ఐదు కిలోల వరకు అదనంగా తూకం వేస్తూ.. 45 కిలోల బరువున్న బస్తాకు 40 కిలోలే లెక్క గడుతున్నారు. ఇలా అదనంగా వచ్చిన వడ్లను సైతం లారీ లోడ్‌తో సహా లెక్కిస్తూ.. అదనపు వడ్ల సొమ్ములను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నొక్కేస్తున్నారు.

కాంట్రాక్టు ఉద్యోగుల చేతుల్లో కీలక బాధ్యతలు

జిల్లాలో నకిలీ ట్రక్‌షీట్లను సృష్టించి 13 లారీల వడ్లను దారి మళ్లించి రూ.91లక్షలను నొక్కేసిన ఘటనలో ఆరుగురిని సిరిసిల్ల పోలీసులు అరెస్ట్‌ చేయగా, మరి కొందరు పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే రూ.14.16 లక్షలు రికవరీ చేయగా, మరో రూ.46.21లక్షలను బ్యాంకు ఖాతాల్లోనే ఫ్రీజ్‌ చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కాంట్రాక్టు ఉద్యోగుల చేతుల్లో కీలక బాధ్యతలు ఉండడంతో అక్రమాలకు తెరలేపినట్లు భావిస్తున్నారు. ఉద్యోగ భద్రత లేక పోవడంతో భయం లేకుండా అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. అపెరల్‌ పార్క్‌ గోదాము నుంచి 86 బస్తాల వడ్లను తరలిస్తూ పట్టుబడిన లారీ కేసు పెండింగ్‌లో ఉండగా, కోనరావుపేట మండలం మల్కపేట కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు శ్రీనివాస్‌ పరారీలో ఉన్నాడు. రుద్రంగికి చెందిన కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు గడ్డం స్వామి సైతం పరారీలోనే ఉన్నాడు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరుగుతుందని, బాధ్యులు ఎవరినీ వదిలిపెట్టమని ఎస్పీ మహేశ్‌ బి గితే వెల్లడించారు.

లోతుగా విచారిస్తే..

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుంచి సింగిల్‌ విండోల చైర్మన్లు, బుక్‌ కీపర్లు, ట్యాబ్‌ ఎంట్రీ ఆపరేటర్లపై లోతుగా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయి. ట్రక్‌షీట్‌ బుక్‌ వివరాలను నిషితంగా పరిశీలిస్తే ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు బయటపడనున్నాయి. గతంలోనూ అపెరల్‌ పార్క్‌, సర్ధాపూర్‌ ఏఎంసీ గోదాముల్లోని ధాన్యం బస్తాలు మాయమయ్యాయి. వ్యాన్లు, లారీల్లో అక్రమంగా వడ్ల బస్తాలను రాత్రి వేళ తరలించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. జిల్లా అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి అక్రమార్కులను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జిల్లాలో ఈ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లు..

కొనుగోలు కేంద్రాలు 236

కొనుగోలు చేసిన ధాన్యం 3,66,963 మెట్రిక్‌ టన్నులు

కొన్న ధాన్యం విలువ రూ.876.57 కోట్లు

వడ్లు అమ్మిన రైతుల సంఖ్య 46,812

రైతుల ఖాతాల్లో జమయిన డబ్బు రూ.753.28 కోట్లు

డబ్బులు పొందిన రైతులు 45,225

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement