డిజిటల్ సర్వేకు పైలెట్ ప్రాజెక్టుగా వేములవాడ రాష్ట్రంలో 10 మున్సిపాలిటీలు ఎంపిక 16 వేల ఎల్‌పీఎఫ్‌ల గుర్తింపు త్వరలో యూపీసీల జారీ
వేములవాడ: పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల వివరాలను శాసీ్త్రయంగా నమోదు చేసి, యజమానులకు పూర్తి భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ మ్యాపింగ్ (నక్ష– నేషనల్ జియాస్పిటకల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హాబిటేటేషన్స్) కార్యక్రమం వేములవాడలో కొనసాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 116 మున్సిపాలిటీల్లో పదింటిని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టులో వేములవాడ ఉండడంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
16 వేల ఎల్‌పీఎఫ్‌ల గుర్తింపు
వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు సుమారు 16 వేల ఎల్‌పీఎఫ్‌లు (ల్యాండ్ పార్సెల్ ఫైళ్లు) గుర్తించారు. డ్రోన్ సర్వే, జియోస్పేషియల్ మ్యాపింగ్, భూరికార్డుల సమన్వయంతో ప్రతి ఆస్తికి ప్రత్యేక గుర్తింపు కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. సర్వేలో భాగంగా ఆస్తి యజమానుల పేరు, ఆధార్, ఇంటి నంబర్, డోర్ నంబర్, ప్లాట్ లేదా సర్వే నంబర్, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, సమాచారాన్ని సేకరిస్తున్నారు. సర్వే పూర్తయ్యాక అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం ఫైనల్ పబ్లికేషన్ విడుదల చేయనున్నారు. తర్వాత ప్రతి ఆస్తికి యూపీసీ (అర్బన్ ప్రాపర్టీ కార్డ్) జారీ చేస్తారు. ఈ కార్డు ద్వారా ఆస్తి యాజమాన్యానికి స్పష్టమైన గుర్తింపు లభించడంతోపాటు భూ వివాదాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆస్తి కొనుగోలు, విక్రయాలు, బ్యాంకు రుణాలు, వారసత్వ హక్కుల నిర్ధారణ వంటి అంశాల్లో యూపీసీ కీలక పత్రంగా ఉపయోగపడనుంది.
ప్రజల సహకారం అవసరం
నక్ష సర్వే విజయవంతం కావాలంటే ప్రజలు సరైన పత్రాలు, వివరాలు అందించి సిబ్బందికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. వేములవాడలో పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలో 10 మున్సిపాలిటీల ఎంపిక
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 116 మున్సిపాలిటీల్లో 10 మున్సిపాలిటీలను పైలెట్ ప్రాజెక్టులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో వేములవాడ, జగిత్యాల, హుస్నాబాద్, జాచెర్ల, కొత్తగూడెం–ములుగు, వర్ధన్నపేట, యాదగిరిగుట్ట, మహబూబాబాద్, మిర్యాలగూడ, కొడంగల్ ఉన్నాయి.
వేములవాడ పట్టణంలో డి జిటల్ మ్యాపింగ్‌కు ఇంటి యజమానులు సహకరించాలి. తమ సిబ్బంది అడుగుతున్న రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇంటి పన్ను రశీదు, కరెంటు బిల్లు, యజమాని ఆధార్‌కార్డులు చూపించాలి. దీంతో యజ మాని కచ్చితమైన ఆస్తి రికార్డు, స్పష్టమైన ఆస్తి సరిహద్దులు, భూవివాదాల తగ్గింపు, మెరుగైన సేవలు, సమగ్ర ప్రణాళిక, అభివృద్ధిలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి.
– గుండ్లూరి లోకేశ్,
మున్సిపల్ కమిషనర్, వేములవాడ


