ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటాపూర్‌లో ఈనెల 24న నిర్వహించే పెద్దమ్మ–పెద్దిరాజుల కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని కోరుతూ ఎమ్మెల్యే కేటీఆర్‌కు ఆదివారం నాయకులు ఆహ్వానపత్రిక అందజేశారు. కల్యాణ వేడుకలకు తప్పకుండా హాజరవుతానని కేటీఆర్ తెలిపారని మాజీ సర్పంచ్ కోల నరసయ్య, మాజీ ఎంపీటీసీ మామిండ్ల తిరుపతిబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు. ముదిరాజ్ సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి
సిరిసిల్ల: తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ సారధి ప్రొఫెసర్ జయశంకర్ 15వ వర్ధంతిని ఆదివారం జిల్లా కేంద్రంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ముందుగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మాసం రత్నాకర్ పటేల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్న తెలంగాణ జాతిపితగా మనకు స్ఫూర్తినిస్తారని వివరించారు. కార్యక్రమంలో కనపర్తి జగదీశ్వర్, చౌటపల్లి రాజ్‌కుమార్, కోడం నరహరి, కొండ శేఖర్, అఖిల, సంధ్య పాల్గొన్నారు.
మౌలిక వసతుల కల్పనకు కృషి
ముస్తాబాద్(సిరిసిల్ల): సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని నామాపూర్‌లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపట్టిన అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులకు ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య, వైద్యం, రహదారుల వంటి పనులను విరివిగా చేపట్టి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రైతులకు ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ, పెన్షన్, జీవిత బీమా, రైతు భరోసా వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి, వైస్‌చైర్మన్ వెల్ముల రాంరెడ్డి, డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి, సర్పంచ్ అనిల్, ఉపసర్పంచ్ కొమురయ్య, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి సహకరించండి
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని నాగారం గ్రామంలో గల శ్రీకోదండరామస్వామి ఆలయ అభివృద్ధికి సహకారం అందించాలని ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావును కోరారు. ప్రస్తుతం ఆలయ పరిస్థితులు, అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న హనుమాన్ విగ్రహానికి సంబంధించి వివరాలు వివరించారు. కాగా, ఆలయ అభివృద్ధికి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు విద్యాసాగర్‌రావు తెలిపారు. అనంతరం విద్యాసాగర్‌రావును ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.


