వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి.. సమయానికి సిలిండర్ బుడ్డీ అందక ఎల్‌పీజీ వినియోగదారులు ఇబ్బందులు పడుతుంటే.. ఆదివారం సెలవు రోజు గ్యాస్ కనెక్షన్ తనిఖీ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో యువకులు ఓ గ్యాస్ కంపెనీ పేరిట ‘మీ సిలిండర్ కనెక్షన్‌ను తనిఖీ చేయాలి’ అంటూ.. సిలిండర్‌ను పరిశీలించి రూ.240 చొప్పున డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేం అని వినియోగదారులు అడిగితే.. ఐదేళ్ల కోసారి మ్యాన్‌డేటర్ చెకప్ అంటూ.. డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే ఎల్‌పీజీ వినియోగదారులు పెరిగిన గ్యాస్ ధరలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. కనెక్షన్ తనిఖీల పేరిట కలెక్షన్ ఏంటని వినియోగదారులు ప్రశ్నించారు. ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా.. ఆదివారం సెలవు దినం కావడంతో అధికారులు ఎవరూ అందుబాటులో లేరు. ఏది ఏమైనా ‘సందింట్లో సడే మియా’ అన్నట్లుగా ఆర్థిక అవసరాలు అధికంగా ఉండే జూన్ నెలలో ఈ కొత్త వసూళ్లతో వినియోగదారులు అసహానికి గురవుతున్నారు. ఇది చట్టబద్ధమైన తనిఖీలా లేక కాసుల కోసం ఉత్తుత్తి తనిఖీలా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తేల్చాల్సి ఉంది. – సిరిసిల్ల


