పానిపూరి విక్రయాలు నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

పానిపూరి విక్రయాలు నిలిపివేయాలి

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

● అధికారుల తనిఖీలు ● వ్యాపారులకు నోటీస్‌లు

● అధికారుల తనిఖీలు ● వ్యాపారులకు నోటీస్‌లు

సిరిసిల్లటౌన్‌/సిరిసిల్ల అర్బన్‌ /చందుర్తి/ఇల్లంతకుంట/ఎల్లారెడ్డిపేట/వేములవాడఅర్బన్‌: ముక్కపట్టిన పానీపూరీలు.. బూజుపట్టిన ఆలుగడ్డలు.. అపరిశుభ్రంగా తయారీప్రాంతం.. ఇదీ పానీపూరి విక్రయ కేంద్రాల్లో పరిస్థితులు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని కేసీఆర్‌కాలనీలో పానిపూరి తిని 25 మంది అస్వస్థతకు గురికావడంతో జిల్లా అధికారులు చర్యలకు దిగారు. జిల్లా వ్యాప్తంగా పానీపూరి వ్యాపారుల ఇళ్లను, బండ్లను శుక్రవారం తనిఖీ చేశారు. సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.ఎ.ఖదీర్‌పాషా, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఏంజెల ఆల్ప్రైడ్‌, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్‌ అరుణ ఆధ్వర్యంలో శుక్రవారం చాట్‌భండార్‌లపై ఆకస్మిక దాడులు చేశారు. కొన్ని కేంద్రాలలో నిల్వ ఉంచిన పానిపూరీలు, ఫంగస్‌ పట్టిన ఉల్లిగడ్డలు, బంగాళ దుంపలు గుర్తించినట్లు కమిషనర్‌ తెలిపారు. వెంటనే వాటిని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆఫ్రాన్లు, క్యాప్స్‌ ధరించాలి

చాట్‌భండార్లు, హోటల్స్‌ నిర్వాహకులు ఆఫ్రాన్లు, హెయిర్‌ క్యాప్స్‌ ధరించాలని ట్రెయినీ కలెక్టర్‌ నిఖితారెడ్డి, వేములవాడ ఆర్డీవో కే.ఎస్‌.బి.కుమారి సూచించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని పానిపూరి దుకాణాల్లో తనిఖీ చేశారు. అపరిశుభ్రంగా ఉన్న వాటిని వెంటనే తొలగింపజేయించారు. నమూనాలు సేకరించారు. తనిఖీలో మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌పాషా, లోకేశ్‌, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనూష ఉన్నారు.

నాణ్యత ప్రమాణాలు పాటించాలి

పానిపూరి సెంటర్లు, హోటళ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని డీఎల్‌పీవో వీరభద్రయ్య సూచించారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో పానీపూరి సెంటర్‌, నివాసాలను ఎంపీడీవో రమేశ్‌తో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. తంగళ్లపల్లిలో కార్యదర్శి సమీర్‌ హోటళ్లను తనిఖీ చేసి నోటీసులు అందజేశారు. ఎంపీవో మీర్జా, కార్యదర్శి రవీందర్‌ పాల్గొన్నారు.

ఆహార పదార్థాలు సీజ్‌

వేములవాడలో పానిపూరీ విక్రయిస్తున్న స్టాల్‌ను ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, కమిషనర్‌ లోకేశ్‌, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ అనూష తనిఖీ చేశారు. అపరిశుభ్రమైన పరిసరాల మధ్య తినుబండారాలు విక్రయిస్తున్నారని గుర్తించిన అధికారులు ఆహార పదార్థాలను సీజ్‌ చేసి తరలించారు. వానకాలం వెళ్లే వరకు ఎలాంటి విక్రయాలు చేయొద్దని హెచ్చరించారు.

పానిపూరి బండ్లు సీజ్‌

చందుర్తి మండలం మర్రిగడ్డలో పానిపూరి విక్రయాలు నిలిపివేయాలని వ్యాపారి రమేశ్‌ను ఇన్‌చార్జి ఎంపీవో రాజేశ్వర్‌, సర్పంచ్‌ మనిషా ఆదేశాలు జారీ చేశారు. ఇల్లంతకుంటలో రాజస్థాన్‌కు చెందిన ఓ కుటుంబంతోపాటు నాగరాజు, ఓరగంటి పరశురాం పానిపూరి విక్రయిస్తారు. వారి ఇళ్లల్లో ఎంపీడీవో శశికళ తనిఖీ చేశారు. ఓరగంటి పరుశురాం వద్ద పానీపూరి పదార్థాలు అపరిశుభ్రంగా ఉండడంతో బండిని సీజ్‌ చేశారు. ఎంపీవో మహమ్మద్‌ వజీర్‌, కార్యదర్శి చంద్రశేఖర్‌ తనిఖీలు చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పానిపూరి బండ్ల నిర్వాహకులకు గ్రామపంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజులపాటు పానీపూరి విక్రయించొద్దని ఆదేశించారు. సర్పంచ్‌ ఎలగందుల నర్సింలు, ఉపసర్పంచ్‌ బందారపు బాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement