● అత్యధికంగా మల్లారంలో 41.5 డిగ్రీలు ● అత్యల్పంగా చందుర్తిలో 38.6 డిగ్రీలు
సిరిసిల్ల: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వర్షాకాలం ప్రవేశించి పక్షం రోజులు గడుస్తున్నా వర్షాల జాడలేక మృగశిర కార్తెలో ఎండలు దంచికొడుతున్నాయి. జిల్లాలో శుక్రవారం వేములవాడ మండలం మల్లారం వద్ద అత్యధికంగా 41.5 డిగ్రీలు నమోదు కాగా.. అత్యల్పంగా చందుర్తిలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి వద్ద 41.1, కలెక్టరేట్ వద్ద 40.5, ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ వద్ద 40.4, ఇల్లంతకుంటలో 40.6, కోనరావుపేట మండలం మర్తనపేటలో 40.1, సిరిసిల్ల శివారులోని పెద్దూరు వద్ద 40.4, వట్టెంలలో 41.2, నామాపూర్‌లో 41.1, రుద్రంగిలో 41.3, మరిగడ్డలో 38.6, వీర్నపల్లిలో 38.8, నేరెళ్లలో 39.9, ఎల్లారెడ్డిపేటలో 39.1, గంభీరావుపేటలో 39.0, మానాలలో 39.1, నిజామాబాద్ 39.6, గజసింగవరం 39.2, ఆవునూర్ 39.8, పెద్దలింగాపూర్‌లో 40.0 డిగ్రీలు నమోదయ్యాయి.
ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి
వేములవాడరూరల్: రైతులు ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం కోరారు. వేములవాడ మార్కెట్‌యార్డులోని ఏడీఏ కార్యాలయంలో శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందని, రైతులు కంది, పెసరతోపాటు చిరుధాన్యాల పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. జిల్లా రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ఆర్.సాయికుమార్, వేములవాడ మండల ఏవోలు వినీతరెడ్డి, సాయికృష్ణ పాల్గొన్నారు.


