● టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత
సిరిసిల్ల: కొత్తగా తెచ్చిన యూరియా యాప్‌ను రద్దు చేయకుంటే ప్రభుత్వంతో యుద్ధం చేస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ని ర్వహించిన జెండా పండుగలో పాల్గొని మాట్లాడా రు. తెలంగాణలో సామాజిక న్యాయం జరగలేదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దక్కాల్సిన రాజ్యాంగ ఫలాలు దరి చేరలేదన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు వీకెండ్ ఎమ్మెల్యే అ య్యారని ఆరోపించారు. నేరెళ్ల బాధితులను త్వరలోనే అందరూ ఆశ్చర్యపోయేలా ఆదుకుంటామన్నారు.
నేతన్నకు దండ వేసి.. అమరవీరులకు నివాళి
సిరిసిల్ల కొత్త చెరువు కట్ట వద్ద కవితకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. అక్కడి నుంచి ర్యాలీగా సిరిసిల్ల పాత బస్టాండ్ నేతన్న చౌక్‌కు చేరుకుని నేతన్న విగ్రహానికి పూల మాల వేసి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అంబేడ్కర్ చౌరస్తా వరకు కాలినడకన వచ్చి అంబేడ్కర్, మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రీబాయి ఫూలే విగ్రహాలు పూల మాలలు వేశారు. అనంతరం గ్రంథాలయం ముందున్న టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. జిల్లా ఇన్‌చార్జి ఎండీ మాజిద్ అబ్దుల్, నాయకులు సంకెపల్లి సుమలత, సుధాకర్‌శర్మ, ధరణి, సంపత్, బుస్సా వేణు, కుసుమ విష్ణు, వరద సతీశ్, నూనె మల్లేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులను పరామర్శించిన కవిత
సిరిసిల్లటౌన్: పానీపూరి తిని అస్వస్థతకు గురై జిల్లాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వైద్యంతో ఆదుకోవాల్సినోళ్లు బాధ్యతారాహిత్యంగా ఉండటం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆహారకల్తీ అనేక విధాలుగా జరుగుతున్నా సర్కారు దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


