నత్తకే నవ్వొచ్చేలా! | - | Sakshi
Sakshi News home page

నత్తకే నవ్వొచ్చేలా!

Jun 18 2026 12:05 AM | Updated on Jun 18 2026 12:05 AM

ఏడాదిగా కొనసా..గుతున్న రోడ్డు విస్తరణ పనులు

రూ.6కోట్లతో పనులు మొదలు

దుమ్ము ధూళితో జనం అవస్థలు

వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రం.. దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలో రోడ్డు విస్తరణ పనులు నత్తకే నవ్వొచ్చేలా సా..గుతున్నాయి. ఏడాది క్రితం మొదలుపెట్టిన పనులు ఇంకా కొసముట్టడం లేదు. రూ.6కోట్లతో 80 ఫీట్ల వెడల్పుతో తిప్పాపూర్‌ బ్రిడ్జి నుంచి రాజన్న ప్రధాన ఆలయం వరకు పనులు చేస్తున్నారు. పనులు పూర్తికాకపోవడంతో రోడ్డుపై వాహనాలు వెళ్తున్నప్పుడు లేస్తున్న దుమ్ముదూళితో దుకాణదారులు, నివాసితులు ఇబ్బందిపడుతున్నారు.

రూ.6కోట్లు 80 ఫీట్లు

రాజన్న ప్రధాన ఆలయం నుంచి బ్రిడ్జి వరకు 80 ఫీట్ల వెడల్పుతో రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకు ప్రభుత్వం రూ.6కోట్లు మంజూరు చేసింది. ముందుగా రూ.47 కోట్లతో పనులు చేపట్టాలని సంకల్పించారు. ఇందుకు 750 మీటర్ల మేర స్థలం అవసరం ఏర్పడింది. 254 మంది లబ్ధిదారులు ఉండగా.. 322 నిర్మాణాలు కూల్చి వేయాల్సి ఉంది. ఒకటి, రెండు మినహా నిర్మాణాల కూల్చివేతలు పూర్తి చేశారు. ఆ తర్వాత సుమారు రూ.6కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ ప్రక్రియకు నిధులు విడుదల అంశంలో ఏర్పడిన చిన్నపాటి జాప్యంతో ఏడాదిగా ముందుకు సాగడం లేదు. మొదట నిధుల కొరతతో పనులు కొంతకాలం నిలిచిపోయాయి. అనంతరం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో మళ్లీ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. విద్యుత్‌ స్తంభాల తొలగింపు, డ్రెయినేజీ నిర్మాణం, భవనాల సర్దుబాటు వంటి కారణాలతో పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పనులు కొనసాగుతుండడంతో మట్టి, కంకరతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము కారణంగా రోడ్డు పక్కన ఉన్న వ్యాపారసంస్థలకూ నష్టం జరుగుతోంది. భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతంలో ఈ పరిస్థితి ఇబ్బందిగా మారింది.

శాఖల మధ్య సమన్వయ లోపం

రోడ్ల విస్తరణ పనుల్లో శాఖల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిధులు విడుదలై పనులు ప్రారంభమైనప్పటికీ విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ శాఖల మధ్య సమన్వయ లోపంతో పనులకు బ్రేక్‌ పడింది. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ బుధవారం ప్రత్యేక చొరవ తీసుకుని వీరిని సమన్వయపరచి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement