● కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ ● నారాయణపూర్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు సన్మానం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జీవితాలను చదువు ఒక్కటే నిలబెడుతుందని.. చదువు ఉంటే డబ్బు..పేరు.. అన్నీ వస్తాయని కేంద్ర సాహిత్య అకాడమీ, కాళోజీ అవార్డు గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్ పేర్కొన్నారు. 1 నుంచి 9వ తరగతి వరకు ప్రతిభ చూపిన విద్యార్థులకు నారాయణపూర్ సేవ సమితి ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహకాలు అందించారు. పదో తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున ప్రోత్సాహకాన్ని నలిమెల భాస్కర్ సొంతంగా బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఇక్కడి మట్టికి మహత్తు ఉందని.. మేధావుల పుట్టినిల్లు ఈ ఊరు అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి నారాయణపూర్‌కు వచ్చి ఈ ఊరికి చెందిన ముగ్గురి కవులతో ఆ కాలంలోనే పద్యాలు రాయించుకొని, గోల్కొండ పత్రికలో అచ్చు వేశారని గుర్తు చేశారు. ఊరు పేరును నిలబెట్టేందుకు విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు. అకుంఠిత దీక్ష.. అవిరళ కృషితోనే విజయాలు సాధిస్తామన్నారు. గ్రామ సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ గ్రామానికి చెందిన లింగాలు, దుబ్బ విశ్వనాథంతోపాటు పలువురు వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డప్పటికీ గ్రామం మీద మమకారంతో సహకరిస్తున్నారన్నారు. నారాయణపూర్ సేవ సంస్థ సేవలు అమోఘమన్నారు. ఎంఈవో కృష్ణహరి మాట్లాడుతూ తాను హెచ్‌ఎంగా ఈ స్కూల్‌కు వచ్చినప్పుడు జిల్లాలోనే చిట్టచివరి స్థానంలో ఉండేదని.. అప్పటి నుంచి చేసిన శ్రమకు ఈనాటి ఫలితాలే నిదర్శనమన్నారు. ఐఏఎస్ రమణాచారి ఫోన్‌లో తన సందేశాన్ని అందించారు. 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను తిరుమల, తిరుపతి దర్శనానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.


