హాలాహలమా! | - | Sakshi
Sakshi News home page

హాలాహలమా!

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

● రంగుమారిన నల్లా నీరు ● తాగేందుకు జంకుతున్న జనం ● అడుగంటిన మధ్యమానేరు ● మిషన్‌ భగీరథపై అధికారుల నిర్లక్ష్యం భగీరథ లక్ష్యం వృథా

జిల్లాలో మిషన్‌ భగీరథ స్వరూపం

జలమా..
● రంగుమారిన నల్లా నీరు ● తాగేందుకు జంకుతున్న జనం ● అడుగంటిన మధ్యమానేరు ● మిషన్‌ భగీరథపై అధికారుల నిర్లక్ష్యం

మధ్యమానేరులో రుద్రవరం వద్ద

ఇన్‌టేక్‌ వెల్‌

ఇవీ మిషన్‌ భగీరథ ద్వారా సరఫరా అయిన నీరు. తాగేందుకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతుండగా.. ఇలా రంగుమారిన మురికినీరు వస్తుంది. ఫలితంగా జనం తాగకుండా ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. తాగేందుకు మాత్రం బబుల్‌తో ఫిల్టర్‌వాటర్‌ను తెచ్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా రంగుమారిన నీరు సరఫరా అవుతోంది.

ఇది జిల్లా కేంద్రంలోని గీతానగర్‌ బీసీ బాలికల హాస్టల్‌ ఎదుట మిషన్‌ భగీరథ నల్లా పైపు. రంగుమారి నీరు రావడంతో హాస్టల్‌లో పట్టుకోకుండా ఇలా వృథాగా వదిలేశారు. ఫలితంగా తాగునీరు నేల పాలవుతుంది. ఒక్కటి, రెండు చోట్ల కాదు జిల్లా వ్యాప్తంగా మిషన్‌ భగీరథ నీటిని జనం తాగేందుకు జంకుతున్నారు.

ఇది వేములవాడ అర్బన్‌ మండలం రుద్రవరం మిషన్‌ భగీరథ పథకానికి నీటిని అందించే మధ్యమానేరు జలాశయంలోని కెనాల్‌. మధ్యమానేరులో ప్రస్తుతం 7.443 టీఎంసీల నీరు ఉండగా.. కెనాల్‌ ద్వారా ఇన్‌టేక్‌ వెల్‌కు నీరు వస్తోంది. ఈ నీటిని పంపింగ్‌ చేసి అగ్రహారంలోని ప్లాంటులో శుద్ధి చేసి జిల్లాలోని నీళ్ల ట్యాంకులకు సరఫరా చేస్తున్నారు. ఇటీవల శుద్ధిచేసిన నీరు సైతం రంగు మారి వస్తోంది. దీంతో ఆ నీటిని తాగేందుకు, ఇతర అవసరాలకు సైతం వినియోగించేందుకు జనం జంకుతున్నారు.

సిరిసిల్ల: జిల్లాలో మిషన్‌ భగీరథ నీరు రంగుమారి సరఫరా అవుతోంది. పచ్చగా మారడంతో ఆ నీటిని తాగేందుకు జనం జంకుతున్నారు. బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర) జలాశయంలో నీటి నిల్వలు బాగా తగ్గిపోయాయి. 26 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల మిడ్‌మానేరులో ప్రసుత్తం 7.443 టీఎంసీల నీరు ఉంది. దీంతో నీటిని పంపింగ్‌ చేసే ఇన్‌టేక్‌ వెల్‌ వద్దకు వచ్చే కెనాల్‌లో నీటి ప్రవాహ వేగం తగ్గింది. నీటి నిల్వలు తక్కువగా ఉండి కెనాల్‌లో వేగం తగ్గి ఇన్‌టేక్‌ వెల్‌కు ఫ్లో తగ్గింది. దీని ప్రభావంతో నీటిశుద్ధి పంపులకు పూర్తి స్థాయిలో నీరు రావడం లేదు. ఫలితంగా నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల వర్షాలకు కొద్దిగా కొత్త నీరు చేరడంతో నిల్వ ఉన్న నీరు రంగు మారింది. ఆ నీటిని శుద్ధి చేసినా పూర్తి స్థాయిలో తేటగా కావడం లేదు. ఫలితంగా రంగుమారిన నీరే నల్లాల్లో వస్తుంది.

భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ ఉంటుందని, ఉపరితలం(చెరువులు, కుంటలు)లోని నీరు తాగేందుకు మంచివి అని మిషన్‌ భగీరథను ప్రారంభించారు. కానీ మధ్యమానేరులోకి గంభీరావుపేట ఎగువమానేరు, వేములవాడ మూలవాగు ద్వారా వచ్చే వరదనీరు చేరుతోంది. ఆ వాగుల్లో పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల వారు శవాలను దహనం చేయడం, చనిపోయిన జంతువులను వేస్తుంటారు. వర్షాలు పడి వచ్చే వరదలతో వాగులోని మలినాలు కొట్టుకుపోయి మధ్యమానేరులోకి చేరుతున్నాయి. ఆ నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తుండగా జనం తాగేందుకు వినియోగించడం లేదు. ఫలితంగా మిషన్‌ భగీరథ లక్ష్యం గాడి తప్పుతోంది. జిల్లాలో ప్రస్తుతానికి నీటి కొరత లేదు. కానీ, తాగునీరు రంగుమారి రావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరా పైపుల లీకేజీ, అంతర్గతంగా నల్లాల పైపుల లీకేజీ సమస్యలతో నీరు కలుషితం అవుతుందనే అనుమానాలు ఉన్నాయి. రంగుమారి వస్తున్న నల్లానీటి సరఫరాను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.

మండలాలు: 12(తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, గంభీరావుపేట, వీర్నపల్లి, సిరిసిల్ల అర్బన్‌, వేములవాడ రూరల్‌, కోనరావుపేట, చందుర్తి,

బోయినపల్లి, రుద్రంగి)

మున్సిపాలిటీలు: సిరిసిల్ల, వేములవాడ

ఆవాస ప్రాంతాలు: 359

తాగునీరు పొందే జనాభా: 6 లక్షలు

నల్లాలు : 1,36,766

నిర్మాణ వ్యయం : రూ.1,085 కోట్లు

పైపులైన్‌ పొడవు : 1,263.77 కిలోమీటర్లు

నీళ్ల ట్యాంకులు : 625

పాత నీళ్ల ట్యాంకులు : 378

కొత్తగా నిర్మించిన ట్యాంకులు: 247

రోజుకు అవసరమైన నీరు : 10 కోట్ల లీటర్లు

వినియోగించే మోటార్లు : 20

అవసరమయ్యే విద్యుత్‌ : 5.976 మెగా వాట్స్‌

ఆధారం: మధ్యమానేరు జలాశయం

(26 టీఎంసీలు)

మధ్యమానేరులో ప్రస్తుతం ఉన్న నీరు: 7.433 టీఎంసీలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement