సంఘాలు, సభ్యుల వివరాలు
● 19న ఎన్నికల నిర్వహణ ● జిల్లాలో 7 చేనేత, 4 పవర్‌లూమ్ సహకార సంఘాలు ● 321 మంది సభ్యులు ● ఓటర్ల జాబితా సిద్ధం చేసిన అధికారులు
సిరిసిల్ల: రాష్ట్రంలోని చేనేత, పవర్‌లూమ్ సహకార సంఘాల పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలో 7 చేనేత, 4 పవర్‌లూమ్ సహకార సంఘాలు ఉన్నాయి. 11 సంఘాల ఎన్నికలను ఈ నెల 19న నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్‌ను సహకార శాఖ అధికారులు మంగళవారం విడుదల చేశారు. పరిమిత ఓట్లు ఉండడంతో ఒకే రోజు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలలోగా.. నామినేషన్ల దాఖలు, పరిశీలన, చేతులెత్తే విధానంలో ఎన్నికలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.
13 ఏళ్ల తర్వాత..
జిల్లాలో చివరిసారిగా 2013 ఫిబ్రవరిలో చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. 2018లో ఆ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఆరునెలలకోసారి పాలకవర్గాల పదవీకాలాన్ని పొడగిస్తూ వచ్చిన ప్రభుత్వం తాజాగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. 11 సహకార సంఘాల ఫొటో గుర్తింపు కార్డులతో కూడిన ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేసి రాష్ట్ర సహకార శాఖ అధికారులకు పంపించారు. సహకార శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ పర్యవేక్షణలో ఎన్నికలు జరగనున్నాయి.
రిజిస్ట్రేషన్ అయిన సంఘాలకే..
సహకార చట్టం 1964 ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన చేనేత సహకార సంఘాలను ప్రభుత్వం గుర్తించింది. జిల్లాలో 7 సంఘాలు ఆ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ కాగా, నాలుగు పవర్‌లూమ్ సంఘాలు సదరు చట్టం పరిధిలో ఉన్నాయి. చేనేత సహకార సంఘాల్లో 234, పవర్‌లూమ్ సహకార సంఘాల్లో 87 మంది సభ్యులు ఉన్నారు. ఒకప్పుడు వందలాది మంది సభ్యులు ఉండడంతో ఒక వెలుగు వెలిగిన సంఘాలు ఇప్పుడు పెద్దగా సభ్యులు లేక ఉన్నాయి. చేనేత వృత్తిని ఎవరూ చేయకపోవడంతో అంతా పవర్‌లూమ్‌కు మారడంతో చేనేత సంఘాలు, మగ్గాలు మూలనపడ్డాయి. ప్రస్తుతం ఉన్న సంఘాల్లోని సభ్యులు సైతం వృద్ధాప్యంలో ఉన్నారు.
చేతులు ఎత్తే విధానంలో..
జిల్లాలో 19న జరిగే ఎన్నికల్లో సంఘాల సభ్యులు చేతులు ఎత్తే విధానంలో పాలకవర్గాలను ఎన్నుకుంటారు. ఒక్కో సంఘంలో 9 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. అదే రోజు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, పాలకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. జిల్లా స్థాయిలో అధ్యక్షులు అంతా కలిసి రాష్ట్ర చేనేత, సహకార సంఘం(టెస్కో) అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది.
సంఘం సభ్యుల సంఖ్య
చేనేత కార్మిక సహకార సంఘం, వేములవాడ 36
చేనేత కార్మిక సహకార సంఘం, సిరిసిల్ల 37
మహేశ్వర చేనేత కార్మిక సహకార సంఘం, సిరిసిల్ల 36
భద్రవతి చేనేత కార్మిక సహకార సంఘం, సిరిసిల్ల 28
చేనేత కార్మిక సహకార సంఘం, మామిడిపల్లి 47
జగదాంబ చేనేత కార్మిక సంఘం, సిరిసిల్ల 18
చేనేత కార్మిక సహకార సంఘం, హన్మాజిపేట 32
సరస్వతి పవర్‌లూమ్ కార్మిక సంఘం, సిరిసిల్ల 22
అశోక పవర్‌లూమ్ కార్మిక సంఘం, సిరిసిల్ల 23
భాగ్యలక్ష్మీ పవర్‌లూమ్ సహకార సంఘం, సిరిసిల్ల 21
శ్రీలక్ష్మీ పవర్‌లూమ్ సహకార సంఘం, సిరిసిల్ల 21


