● ఎస్పీ మహేశ్ బి గితే
ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రజా ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. మంగళవారం ఇల్లంతకుంట పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించారు. ప్రజలకు పోలీస్ సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది, సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని వివరించారు. రాత్రి వేళ పెట్రోలింగ్ ముమ్మరం చేసి చోరీలు, గంజాయి రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా గ్రామాల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సీఐ నాగేశ్వరరావు, ఎస్సై అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పర్మినెంట్ చేయాలని వినతి
సిరిసిల్లటౌన్: మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ ముందు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలుపగా ఆయన మాట్లాడారు. రూ.26 వేలు కనీస వేతనాలివ్వాలని, మృతిచెందిన, 60ఏళ్లు పైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 18,19వ తేదీల్లో మున్సిపల్ ముందు, 22న కలెక్టరేట్ వద్ద దీక్షలు చేపడుతామని పేర్కొన్నారు. అనంతరం కమిషనర్ ఎంఏ ఖదీర్‌పాషాకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బాలయ్య, బాలకిషన్, మమత, శంకర్, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
వయోధికుల కేసులు సత్వరం పరిష్కరిస్తా
వేములవాడ/వేములవాడఅర్బన్: పెండింగ్‌లో ఉన్న వయోవృద్ధుల కేసులు సత్వరం పరిష్కారిస్తానని ఆర్డీవో కుమారి పేర్కొన్నారు. వేములవాడ ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన ఆమెను సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కార్యవర్గం నాయకులు మంగళవారం సన్మానించారు. ఈసందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కేసుల పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జనపాల శంకరయ్య, జిల్లా అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, రాష్ట్ర కార్యదర్శి రామరాజు, కోశాధికారి దొంత దేవదాసు, ధ్యావనపెళ్లి శ్రీహరి తెలిపారు.
‘పేదలకందని బ్లడ్ బ్యాంక్ సేవలు’
సిరిసిల్లటౌన్: జిల్లాసుపత్రిలోని ప్రభుత్వ బ్లడ్‌బ్యాంకులో పేదలకు సేవలు అందడం లేదని సీపీఎం పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ ఆరోపించారు. మంగళవారం స్థానిక కార్మిక భవన్‌లో మాట్లాడారు. బ్లడ్ బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. అత్యవసర పరిస్థితులలో బ్లడ్ కోసం ఆసుపత్రిలో ఆశ్రయిస్తే వేరే వ్యక్తి బ్లడ్ ఇస్తేనే బ్లడ్ ఇస్తామని కండిషన్ పెట్టడం సరికాదన్నారు. పైగా ఫ్రెష్ బ్లడ్ ఇక్కడ ఉండదని పేషంట్‌ను సిబ్బంది భయభ్రాంతులకు గురిచేసి ప్రైవేట్ బ్లడ్ బ్యాంకు వెళ్లమని సలహాలు ఇస్తున్నారన్నారు. నాయకులు శ్రీరాముల రమేశ్‌చంద్ర, అలువాల లక్ష్మణ్, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు.


