సమస్యలు పరిష్కరించండయ్యా | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించండయ్యా

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

భూమి గుంజుకుని చంపుతా అంటున్నాడు నా భూమిని పక్కవాళ్లకు పట్టా చేశారు కార్యదర్శిపై చర్యలు తీసుకోండి బోర్ల బిల్లులు ఇప్పించండి ఇల్లు మంజూరుజేసి అప్పుల పాలు చేశారు మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేయండి

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

బారులు తీరి.. బాధలు వివరించిన జనం

కలెక్టరేట్‌లో ప్రజావాణికి 205 దరఖాస్తులు

సిరిసిల్ల: జిల్లాలోని నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు పలువురు కదిలివచ్చారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రాలను అందించారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, జిల్లా రెవెన్యూ అధికారి గొట్టె జయశ్రీ, హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకటమాధవరావు ప్రజల విజ్ఞాపలు స్వీకరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 205 మంది వివిధ సమస్యలపై దరఖాస్తులు అందించారు.

మాది చందుర్తి మండలం జోగాపూర్‌. నేను కష్టపడి పది ఎకరాల భూమి సంపాదించాను. నా మొదటి భార్య దురదృష్టవశాత్తు మరణించింది. ఆమెకు ఒక్క కొడుకు. బంధువులు మళ్లీ నాకు బలవంతంగా పెళ్లి చేయగా ఆమెకు ఒక్క కూతురు. నా మొదటి భార్య కొడుకు మొత్తం భూమి పట్టా చేయించుకున్నాడు. రెండో భార్య కూతురుకు సగం భూమి ఇవ్వాలంటే ఒప్పుకోకుండా చంపుతానని బెదిరిస్తున్నాడు. సగం భూమి నా బిడ్డకు ఇప్పించండి.

– మ్యాకల మల్లయ్య దంపతులు, జోగాపూర్‌

నాది ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌. నా పేరిట, మా తమ్ముడి పేరిట ఉన్న భూమిని పక్కవాళ్లకు 19 గుంటలు రెవెన్యూ అధికారులు పట్టా చేశారు. కబ్జాలో మేమే ఉన్నా పట్టించుకోలేదు. మా పాస్‌బుక్కులో తక్కువ భూమిని నమోదు చేశారు. ఎన్ని సార్లు ఇల్లంతకుంట తహసీల్దార్‌ ఆఫీస్‌కు వెళ్లినా పట్టించుకోవడం లేదు.

– ఎగుర్ల బీరయ్య, కందికట్కూర్‌

మాది వేములవాడ అర్బన్‌ మండలం చింతలఠాణా ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ. మా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి జీపీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా సొంత ఖాతాలో వేసుకుని దుర్వినియోగానికి పాల్పడ్డాడు. సుమరు రూ.5 లక్షలు 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకున్నాడు. అతనిపై విచారణ చేపట్టాలి.

– పార్వతి మహేశ్‌,

చింతలఠాణా ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ

కోనరావుపేట మండలం మరిమడ్ల ఏకలవ్య గురుకుల పాఠశాలను 2025లో అప్పటి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు నీళ్ల సరిపోవడం లేదని పిల్లలు చెప్పగా వెంటనే బోర్లు వేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాలతో రెండు బోర్లు వేసి, మోటార్లు పెట్టి నీటి వసతి కల్పించాను. కానీ ఆ బోర్లు, మోటార్ల బిల్లులు ఇప్పటికీ ఇవ్వడం లేదు. బిల్లులు ఇప్పించండి.

– మాట్ల అశోక్‌,

మాజీ సర్పంచ్‌, మరిమడ్ల

నాది వీర్నపల్లి మండలం సీతారాంనాయక్‌తండా. మాకు ఇల్లు లేదు. మా ఆయన లింగం వ్యవసాయ కూలీ. మాకు గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరు చేశారు. ఇల్లు మంజూరైందని రూ.10లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటే బిల్లు ఇవ్వడం లేదు. మూడు సార్లు అధికారులు వచ్చి ఇల్లు కొలతలు తీశారు. కానీ ఒక్క పైసా రాలేదు. ఇంకా ఇల్లు పూర్తి కాలేదు. బిల్లు ఇస్తే ఇల్లు పని పూర్తి అవుతుంది.

– భానోత్‌ అనూష, సీతారాంనాయక్‌ తండా

మాది ముస్తాబాద్‌ మండలం నామాపూర్‌. మా ఊరిలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లేదు. మా ఊరిలో 22 మంది మత్స్యకార్మికులు ఉన్నారు. మా ఊరి మత్స్యకార్మికుల ఉపాధి కోసం చెరువుల్లో చేపలు వేసేందుకు, పట్టుకునేందుకు వీలుగా సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలి. మా ఊరి చెరువులో వేరే ఊరి వారికి చేపలు పట్టుకునే హక్కు కల్పించొద్దు.

– నామాపూర్‌ వాసులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement