తొలి రోజు అంతంతే ! | - | Sakshi
Sakshi News home page

తొలి రోజు అంతంతే !

Jun 16 2026 12:22 AM | Updated on Jun 16 2026 12:22 AM

● విద్యార్థుల హాజరుపై అమావాస్య ఎఫెక్ట్‌ ● పావు వంతే వచ్చిన స్టూడెంట్స్‌

● విద్యార్థుల హాజరుపై అమావాస్య ఎఫెక్ట్‌ ● పావు వంతే వచ్చిన స్టూడెంట్స్‌

సిరిసిల్లటౌన్‌: జిల్లాలో పాఠశాలలు సోమవారం పునర్‌ ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. బడుల ప్రారంభంతో పట్టణంలోని స్టేషనరీ షాపులు, బుక్స్‌ సెల్లర్‌ దుకాణాలు కిటకిటలాడాయి. అమావాస్య కావడంతో తక్కువ సంఖ్యలోనే విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 25.16శాతం మాత్రమే హాజరు నమోదైనట్లు జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

అంగన్‌వాడీలో ఒక్కరే..

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఒకే విద్యార్థి హాజరయ్యారు. ఇల్లంతకుంటకు చెందిన ఓ మహిళ తన కొడుకు మెరుగు ధీరజ్‌ను 1వ తరగతిలో చేర్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆగయ్య విద్యార్థిని పాఠశాలలో చేర్చుకున్నారు.

కోనరావుపేటలో ముగ్గురే..

కోనరావుపేట: మండలంలోని కనగర్తి ప్రాథమిక పాఠశాలకు ముగ్గురు విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరైనా విద్యార్థులు మాత్రం రాలేదు.

గర్జనపల్లిలో పూలవర్షంతో స్వాగతం

వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని గర్జనపల్లి పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయులు పూలవర్షంతో స్వాగతం పలికారు. తరగతి గదులను రంగురంగుల బెలూన్లతో అలంకరించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అబ్దుల్‌ కలాం సెల్ఫీ పాయింట్‌ వద్ద విద్యార్థులు ఫొటోలు దిగారు. హెచ్‌ఎంలు కులేరి ప్రేమ్‌సాగర్‌, గజన్‌, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్‌ శ్రావణి, సెక్రెటరీ పర్శురామ్‌, ఉపాధ్యాయులు బలరాం, మంజుల, శ్రీనివాస్‌, కవిత, రవి, కార్తీక్‌, శేఖర్‌ పాల్గొన్నారు.

అరకొరే..

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని జిల్లెల్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో సుమారు 130 మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. ప్రాథమిక పాఠశాలకి ఒక్కరూ రాలేదు.

మొదటి రోజు ఇద్దరే..

వేములవాడరూరల్‌: మండలంలోని కోనాయపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఇద్దరే పిల్లలు హాజరయ్యారు. విద్యార్థులు లేకపోవడంతో ఉపాధ్యాయులు గదిలో కాలక్షేపం చేశారు.

వేములవాడఅర్బన్‌: వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి రోజు అంతంతే విద్యార్థులు హాజరయ్యారు. పట్టణంలోని అన్ని పాఠశాలల్లో అదే పరిస్థితి నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement